![]() |
![]() |
చిత్ర పరిశ్రమను విషాద వార్తలు విడిచిపెట్టడం లేదు. గత కొన్నిరోజులుగా విషాద వార్తల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవలే సీనియర్ నటి సుబ్బలక్ష్మీ, సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్, మలయాళ నటి లక్ష్మిక సజీవన్ మరణ వార్తలను విన్నాం. ఇప్పుడు మరో విషాద వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడిరది. 600 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి(87) శుక్రవారం కన్నుమూశారు. లీలావతి మరణ వార్త కన్నడ చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచేసింది.
లీలావతి మరణ వార్తను ఆమె కుమారుడు వినోద్‌రాజ్ ప్రకటించారు. వయసు మీదపడి తద్వారా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా లీలావతి బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమెను చేర్పించారు. చికిత్స పొందుతూ లీలావతి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. లీలావతి కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం మర్మయోగి. ఆ తర్వాత కార్తీక దీపం, ఇది కథ కాదు, వాల్మీకి, మరో మలుపు లాంటి చిత్రాల్లో నటించారు. నటిగానే కాదు నిర్మాతగా కూడా ఆమె పలు చిత్రాలను నిర్మించారు. తన నటనకు గాను ఆమె ఎన్నో అవార్డులను పొందారు.
![]() |
![]() |