![]() |
![]() |
హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యలు, దానికి త్రిష ఘాటుగా స్పందించడం, ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతు తెలపడం, మన్సూర్‌పై పోలీస్ కేసు నమోదు కావడం...ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. కోర్టు నుంచి సమన్లు అందుకున్న మన్సూర్ విచారణకు కూడా హాజరై త్రిషను క్షమాపణ కోరాడు. దీంతో సమస్య పరిష్కారమైంది అని అందరూ అనుకున్నారు. కానీ, మన్సూర్ మాత్రం దీన్ని మరింత జఠిలంగా మార్చే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకోకుండా చిరంజీవిలాంటి ప్రముఖ హీరో తనది వక్రబుద్ధి అంటూ దుర్భాషాలాడారని తీవ్రస్థాయిలో స్పందించాడు మన్సూర్. చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించారని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తనను విమర్శించిన చిరంజీవి, త్రిష, ఖుష్‌బూలపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రకటించాడు.
ఈ విషయంలో త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె నుంచి లిఖిత పూర్వక వివరణ కోరారు పోలీసులు. మన్సూర్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్యాలని, అతనిపై ఎలాంటి కేసులు పెట్టొద్దని త్రిష పోలీసులకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లెటర్‌లో పేర్కొంది. త్రిష ఇచ్చిన లెటర్‌తో మన్సూర్ ఆమె విషయంలో తగ్గినట్టుగానే కనిపిస్తున్నాడు. మరోపక్క నడిగర్ సంఘం కూడా త్రిష వివరణ ఆధారంగా మన్సూర్‌పై విధించిన పాక్షిక నిషేధాన్ని ఎత్తేసింది.
ఇక ఈ విషయంలో మన్సూర్ స్పందన ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. చిరంజీవిపై 20 కోట్లు, త్రిషపై 10 కోట్లు, ఖుష్‌బూపై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించిన మన్సూర్.. త్రిష ఇచ్చిన వివరణతో త్రిష విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. తనపై ఎలాంటి కేసులు పెట్టొద్దని త్రిష లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలియజేయడం, నడిగర్ సంఘం కూడా తనపై విధించిన నిషేధాన్ని కూడా ఎత్తి వేయడంతో ఆమె విషయంలో ముందుకు వెళ్ళేలా లేడు. అయితే చిరంజీవి, ఖుష్‌బూ విషయంలో తను అనుకున్నది చేస్తాడా లేక అన్ని సమస్యలు సమసిపోయాయి కాబట్టి ఇక్కడితో దీన్ని వదిలేస్తాడా? అనేది చూడాలి.
![]() |
![]() |