Home  »  News  »  ఆందోళనలో టాలీవుడ్‌.. తెలంగాణలో ప్రభుత్వం మారుతుందా!

Updated : Dec 2, 2023

ఐదేళ్ళకోసారి ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడం, ఒక్కోసారి అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ టెన్షన్‌ అనేది ఉంటుంది. టాలీవుడ్‌ ప్రముఖుల్లో వివిధ పార్టీలకు చెందినవారు ఉంటారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం చాలాసార్లు జరిగింది. అయితే ఒక్కో పార్టీ పాలసీ ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ గురించిగానీ, అందులోని సమస్యల గురించిగానీ పెద్దగా పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం సినీ పరిశ్రమ విషయంలో సానుకూలంగానే వ్యవహరించిందని చెప్పాలి. ఈ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు సంతోషంగానే ఉన్నారు.


తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టాలీవుడ్‌లో కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇటీవలే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక ఆదివారం జరిగే కౌంటింగ్‌ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొందరంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్‌ కొంత ఆందోళన చెందుతోందని సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్‌ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుంది, తెలుగు సినిమాల విషయంలో వారు ఎలాంటి ఆలోచనతో ఉంటారు అనేది అర్ధంకాని పరిస్థితి. వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలకి ఎక్స్‌ట్రా షోలు, టికెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు కావాలి. ఇలాంటి వాటి వల్లే నిర్మాత పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు భారీ చిత్రాల నిర్మాతలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేదోడు వాదోడుగానే ఉంది. 

ఇప్పుడు అధికారం మారి వేరే ప్రభుత్వం వస్తే టాలీవుడ్‌ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న సినీ ప్రముఖుల్లో తలెత్తుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధికార పగ్గాలను చేజిక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే టాలీవుడ్‌కి అనుకూలంగా ఆ ప్రభుత్వం ఉంటుందా, భారీ చిత్రాల నిర్మాతలకు కావాల్సిన అనుమతుల్ని ఇస్తుందా అనేది ఆయా నిర్మాతలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌ విషయాన్ని తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత స్వేచ్ఛ ఇవ్వకపోయినా ఫర్వాలేదు అనే స్థాయిలో అక్కడి ప్రభుత్వం స్పందిస్తోంది. 

డిసెంబర్‌ 22న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’తో మొదలుపెడితే సంక్రాంతి వరకు చాలా భారీ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. ఇందులో భారీ బడ్జెట్‌ సినిమాలే అధికంగా ఉంటాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఎక్స్‌ట్రా షోలు, టికెట్‌ ధరలు పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం వస్తే ఈ విషయంలో ఎలా స్పందిస్తుందోనని నిర్మాతలు ఇప్పటి నుంచే టెన్షన్‌ పడుతున్నారు. అయితే గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ విషయంలో చాలాసార్లు పాజిటివ్‌గా వ్యవహరించిందనే విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మంచే చేస్తుందని టాలీవుడ్‌ ప్రముఖులు గాఢంగా నమ్ముతున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.