![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల చూపు పాన్ ఇండియాపై పడింది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరికొందరు హీరోలు పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ చూపు సైతం పాన్ ఇండియా వైపు మళ్లిందని అంటున్నారు.
బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బిగ్ స్క్రీన్ మీద బ్లడ్ బాత్ చూడబోతున్నారంటూ ఆ అంచనాలను రెట్టింపు చేసింది మూవీ టీం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
'NBK 109'ని పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నారట. అందుకు తగ్గట్టుగానే వివిధ భాషలకు నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విలన్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, మరో కీలక పాత్ర కోసం తమిళ్ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా కూడా బాలీవుడ్ బ్యూటీనే నటించనుందట.
ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. 'NBK 109' కథ కూడా అన్ని భాషలకు చెందిన యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందట. అందుకే దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |