Home  »  News  »  డాన్స్ మాస్టర్ నుంచి విశ్వ నటుడిగా ఎదిగిన నటుడి పుట్టిన రోజు 

Updated : Nov 6, 2023

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే గొప్ప నటుల్లో ఒకరు కమల్ హాసన్. ఆయన పేరు చెప్తే భారతీయ  సినిమా ప్రేక్షకులు ఎంతగా మురిసిపోతారో సిల్వర్ స్క్రీన్ సైతం అంతే మురిసిపోతుంది. కళ అనే పదానికి పర్యాయ పదం కమల్ హాసన్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు.  తన నటనతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన లోక నాయకుడు  కమల్ నేటితో  69  సంవత్సరాలని పూర్తి చేసుకుంటున్నాడు.
 
తమిళనాడులో లార్జెస్ట్ టౌన్ అయిన పరమకుడి లో జన్మించిన కమల్ నేను పుట్టిందే నటన కోసం అనే రీతిలో 1960  లో  కలాతూర్ కన్నమ్మ అనే సినిమాతో బాల నటుడుగా తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత సినిమా రంగంలో కొన్నాళ్ళు డాన్సర్ గా కూడా  పని చేసిన కమల్   1975  లో వచ్చిన అపూర్వ రాగంగళ్ అనే చిత్రంతో   తన నట విశ్వరూపానికి అంకురార్పణ చేసాడు .తన కంటే వయసులో చాలా రెట్లు పెద్దదైన ఆవిడతో ప్రేమలో పడి ఆమె ప్రేమలో మునిగిపోయే నవ యువకుడు గా కమల్ సూపర్ గా చేసి జాతీయ అవార్డు ని సైతం పొందాడు.

జీవ నదులు ఎలా అయితే భారత దేశాన్ని ఒకటిగా ఉంచుతున్నాయో కమల్  కూడా భారతదేశాన్ని ఒకటిగా ఉంచాలని అనుకున్నాడేమో  ఆయన ఇతర భాషలకి సంబందించిన సినిమాల్లో కూడా నటించాడు . అలాగే అయన సినిమాలన్నీ కూడా అన్ని భాషల్లోను విడుదల అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే 30 ఏళ్ళ క్రితమే  కమల్ పాన్ ఇండియా హీరో గా విజృంభించాడు. మరో చరిత్ర , సాగరసంగమం, స్వాతి ముత్యం, నాయకుడు, పుష్పక విమానం, క్షత్రియ పుత్రుడు ,సత్య,  విచిత్ర సోదరులు , గుణ ,తేవర్ మగన్,నమ్మవర్ ,మహానది, భారతీయుడు,హే రామ్, ఆళవందన్, అంబేశివం,విరుమాండీ, ద్రోహి ,దశావతారం ,విశ్వరూపం ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో నటించి నటనకే నటనని నేర్పిన విశ్వ కధానాయకుడు గా కమల్ అవతరించాడు.ఐ యామ్ కమల్ హాసన్ ఫ్యాన్ అని ప్రతి ఒక్క కమల్ ఫ్యాన్  గర్వంగా చెప్పుకునేలా ఆయన నటన ఉంటుంది.  అన్ని జోనర్ లకి సంబంధించిన కథల్లోనూ ఆయన నటించాడు. భగ్న ప్రేమికుడిగా,  మంచి కొడుకుగా, నమ్ముకున్న వాళ్ళ కోసం అండగా నిలబడే గాడ్ ఫాదర్ గా, సమర్ధవంతమైన పోలీస్ ఆఫీసర్ గా, మంచి తండ్రిగా, సమాజాన్ని ఆలోచింప చేసే బాధ్యతాయుతమైన వ్యక్తిగా , శత్రువుల అటకట్టించే ఫ్యాక్షన్ లీడర్ గా ,మరుగుజ్జు వ్యక్తిగా, నృత్య కళాకారుడిగా ,స్వతంత్ర సమరయోధుడుగా ఇలా ఒకటి కాదు రెండు కాదు కళకి సంబంధించి ఎన్ని పాత్రలు ఉంటాయో అన్ని పాత్రలని కమల్ పోషించాడు . పాత్రలో కి పరకాయప్రవేశం చేసి ఆ పాత్ర గురించి భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకునేలా చెయ్యడం కమల్ స్పెషాలిటీ. లేటు వయసులోను లేటెస్ట్ గా విక్రమ్ సినిమాతో  భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు లని క్రియేట్ చేసాడు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన  రాజ్ కమల్ ఫిలిమ్స్  ఇంటెర్నేషల్ బ్యానేర్ పై తన స్వీయ దర్శకత్వంలో  కూడా కమల్ ఎన్నో చిత్రాలని నిర్మించాడు . ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి అనడానికి విశ్వరూపం మూవీనే ఒక ఉదాహరణ.  మరికొన్ని రోజుల్లో భారతీయుడు 2 మూవీ తో   ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

తనని ఇంతటి వాడిని చేసిన ప్రజల కి సేవ చెయ్యాలనే లక్ష్యంతో  మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీ ని స్థాపించి రాజకీయ రంగంలో కూడా సంచలనం సృష్టించడానికి చూస్తున్న కమల్ హాసన్ గారికి మరో సారి మన తెలుగు వన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.  కమల్ సర్ సినిమా అనేది ఒక మతం అయితే ఆ మతానికి మీరు కూడా  ఒక దేవుడు.     






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.