![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో ఇప్పటిదాకా ఏడు సినిమాలు రాగా.. అందులో 'ఎఫ్-3' యావరేజ్ గా నిలవగా, మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'భగవంత్ కేసరి' ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. మొదటి ఆరు సినిమాలతో కామెడీ ఎంటర్టైనర్స్ ని అందించిన ఆయన.. 'భగవంత్ కేసరి'ని బలమైన ఎమోషన్స్ తో రూపొందించి ప్రేక్షకులను కట్టిపడేసారు. అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దసరా కానుకగా విడుదలైన 'భగవంత్ కేసరి' సంచలన వసూళ్ళతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ ఏది అనే చర్చ నడుస్తోంది.
పటాస్:
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్' సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'అతనొక్కడే' తర్వాత ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఈ మూవీ ఘన విజయాన్ని అందించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే అనిల్ మంచి హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. సీరియస్ కథని తీసుకొని, ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో టాలీవుడ్ కి మరో మంచి కమర్షియల్ డైరెక్టర్ దొరికాడు అనిపించుకున్నారు అనిల్ రావిపూడి.
సుప్రీమ్:
టాలీవుడ్ లో రెండో సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్స్ చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమంది లిస్టులో రావిపూడి కూడా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని సాధించింది. ఒక పిల్లాడికి, అతని ఆశయానికి అండగా హీరో నిలబడటం.. దానిని దర్శకుడు వినోదభరితంగా చెప్పడం ఆకట్టుకుంది.
రాజా ది గ్రేట్:
కొందరు చూపు లేకపోయినా మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో పుట్టిన కథే రాజా ది గ్రేట్. రవితేజ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొంది విజయాన్ని సాధించింది. బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ ని తీసుకొని కూడా ఎవరినీ నొప్పించకుండా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ని అందించవచ్చని రావిపూడి నిరూపించారు.
ఎఫ్ 2:
వెంకటేష్, వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మల్టీస్టారర్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. భార్యాభర్తల మధ్య చిలిపి గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది.
సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ ని సరిగ్గా వాడుకున్న అతికొద్ది మంది దర్శకులలో రావిపూడి ఒకరు. ఆర్మీ నేపథ్యమున్న కథని తీసుకొని, మహేష్ ని సైనికుడిగా చూపిస్తూ కూడా.. ఆ స్థాయి వినోదాన్ని పంచడం రావిపూడికే చెల్లింది. అందుకే ఈ సినిమా కాసుల వర్షం కురిపించి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఎఫ్ 3:
ఎఫ్ 2 కాంబినేషన్ ని, అందులోని పాత్రలను రిపీట్ చేస్తూ అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం 'ఎఫ్ 3'. డబ్బు మీద ఆశ కారణంగా ఎదురైన కష్టాలను సరదాగా చూపిస్తూ రూపుదిద్దుకున్న ఈ కామెడీ ఫిల్మ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే అధిక బిజినెస్, తక్కువ టికెట్ ధరల కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది.
భగవంత్ కేసరి:
తన గత ఆరు చిత్రాలలో కామెడీకి పెద్దపీట వేసిన అనిల్ రావిపూడి.. నందమూరి బాలకృష్ణతో చేసిన 'భగవంత్ కేసరి'కి మాత్రం ట్రాక్ మార్చారు. మంచి సందేశం, బలమైన ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. అందుకే ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఇప్పటిదాకా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో.. ఇదే బెస్ట్ ఫిల్మ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |