![]() |
![]() |

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. 1200కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన తెర మీద కనిపిస్తే స్టార్ హీరోల ఇంట్రడక్షన్ కి మించిన రెస్పాన్స్ థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఒకానొక సమయంలో బ్రహ్మానందం నటించిన సినిమాలేవి? అని కాకుండా.. ఆయన నటించని సినిమాలేవి? అని వెతుక్కునే పరిస్థితి ఉండేది. హీరో ఎవరు?, డైరెక్టర్ ఎవరు?, బ్యానర్ ఏంటి? అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాల్లోనూ బ్రహ్మానందం సందడి చేసేవారు. అలాంటి బ్రహ్మానందం కొంతకాలంగా తెర మీద కనిపించడం తగ్గిపోయింది. ఒకప్పుడు నెలకి రెండు సినిమాల్లో కనిపించిన ఆయన.. ఇప్పుడు ఏడాదికి ఒకట్రెండు సినిమాల్లోనే కనిపిస్తున్నారు. అది కూడా అతిథి పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతలా బ్రహ్మానందం సినిమాలు తగ్గిపోవడానికి కారణమేంటి అని ఆలోచిస్తే.. పలు కారణాలు కనిపిస్తున్నాయి.
వయసు?
ప్రస్తుతం బ్రహ్మానందం వయసు 67 సంవత్సరాలు. ఆయన వయసు వాళ్ళు, ఆయనకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు కూడా ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వయసు అనేది పెద్దగా సమస్య కాకపోవచ్చు.
ఈ తరం రచయితలు పాత్రలు సృష్టించలేకపోతున్నారా?
ఒకప్పుడు చిన్న హీరో సినిమానైనా, స్టార్ హీరో సినిమానైనా.. రచయితలు, దర్శకులు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసేవారు. అవి ప్రేక్షకులను ఎంతగా అలరించేవి అంటే.. కేవలం బ్రహ్మానందం పోషించిన పాత్రలు కారణంగా హిట్ అయిన సినిమాలు బోలెడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. మేకర్స్ కూడా వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అప్పటిలాగా కామెడీకి పెద్దపీట వేయడం, ప్రత్యేక కామెడీ ట్రాక్ లు రాయడం అనేవి ఈమధ్య తగ్గిపోయాయి. కొన్ని కామెడీ సినిమాలు వస్తున్నప్పటికీ, వాటిలో బ్రహ్మానందం స్థాయికి తగ్గ కామెడీ పాత్రలు ఇప్పటి రచయితలు రాయడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
రెమ్యునరేషన్?
మరే ఇతర కమెడియన్ కి సాధ్యంకాని క్రేజ్ బ్రహ్మానందం సొంతం. అందుకు తగ్గట్టుగానే ఆయన రెమ్యునరేషన్ రోజుకి లక్షల్లో ఉంటుంది. ఆయనకు ఇచ్చే రెమ్యునరేషన్ తో ఇద్దరు ముగ్గురు యంగ్ కమెడియన్స్ ని తీసుకోవచ్చు. ఆ పరంగా చూస్తే, అధిక రెమ్యునరేషన్ కూడా ఓ రకంగా బ్రహ్మానందం సినిమాలు తగ్గిపోవడానికి కారణమై ఉండొచ్చు.
కాంబినేషన్?
బ్రహ్మానందం పీక్ టైంలో ఉన్నప్పుడు ఏవీఎస్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరం వంటి దిగ్గజ కమెడియన్లు ఉండేవారు. వారి కాంబినేషన్ లో ఉండే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఒక కమెడియన్ వేసిన పంచ్ కి మరో కమెడియన్ ఇచ్చే రియాక్షన్ అద్భుతంగా కుదిరేది. కానీ ఇప్పుడు బ్రహ్మానందం స్థాయిలో ఆయనతో కలిసి కామెడీ పంచే కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు.
![]() |
![]() |