![]() |
![]() |

ఒక్కోసారి మన అతి నమ్మకమే కొంప ముంచుతుంది. ఇటీవల విడుదలైన 'టైగర్ నాగేశ్వరరావు' విషయంలో అదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిడివి ఎక్కువ కావడం ఈ సినిమాకి మెయిన్ మైనస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టైగర్ నాగేశ్వరరావు నిడివి 3 గంటలకు పైగా అని తెలిసినప్పుడే.. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్ర దర్శకుడు వంశీ మాత్రం నిడివి అసలు సమస్య కాదని, సినిమా చూశాక ఇంకో 30 నిమిషాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. ఆ నమ్మకమే ఇప్పుడు కొంప ముంచింది అంటున్నారు.

విడుదలకు ముందే నిడివి విషయంలో ఆలోచనలో పడ్డ మేకర్స్.. ఈ చిత్రాన్ని హిందీలో 181 నిమిషాల 39 సెకన్ల నిడివితో విడుదల చేయగా, తెలుగులో మాత్రం 172 నిమిషాలకు కుదించారు. హిందీ కంటే తెలుగులో పది నిమిషాల తక్కువ నిడివితో విడుదలైనప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ల్యాగ్ అయిందనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో మేకర్స్ మరోసారి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. సినిమాని మరో 15 నిమిషాలు ట్రిమ్ చేసి, 157 నిమిషాల(2 గంటల 37 నిమిషాల) నిడివితో ప్రదర్శించాలని నిర్ణయించారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు చిత్ర బృందం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |