Home  »  News  »  'కాసర్ గోల్డ్' మూవీ రివ్యూ

Updated : Oct 15, 2023

మూవీ : కాసర్ గోల్డ్
నటీనటులు:  ఆసిఫ్ అలీ , సన్నీ వేన్, వినాయకన్,
రచన: సాజిమోన్ ప్రభాకర్
ఎడిటింగ్: మనోజ్ కన్నోత్
సినిమాటోగ్రఫీ: జెబిన్ జాకబ్
సంగీతం: విష్ణు విజయ్, నిరంజ్ సురేశ్
నిర్మాతలు:  విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్, సూరజ్ కుమార్, రిన్నీ దివాకర్
దర్శకత్వం: మృదుల్ నాయర్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'కాసర్ గోల్డ్' తాజాగా తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:
ఒక అడవిలో కొండమీద రాత్రివేళ చిన్నపిల్లాడు పడుకోకుండా వాళ్ళ నాన్నని కథ చెప్పమని అడుగుతుంటాడు. నిద్రొస్తుంది పడుకోమని ఎంత చెప్పినా ఆ పిల్లాడు వినకుండా కథ చెప్పమని మారాం చేస్తుంటాడు. దాంతో పూర్వం బంగారం మీద మనుషులకి ఎలా ఆశ ఉండేదంటూ స్టార్ట్ చేస్తాడు. అంబు, చెంబు అనే ఇద్దరు యువకులు అడవిలో వెదురు చెట్లు నరికి, వాటిని తీసుకెళ్ళి పట్టణంలో అమ్మి వచ్చిన డబ్బులతో సరుకులు తెచ్చుకొని హ్యాపీగా బ్రతికేస్తారని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళకి ఒక బంగారం మూట దొరుకుతుంది. అందులో చాలా బంగారం ఉండేసరికి ఇద్దరిలో ఆశ పుడుతుంది. ఇక ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకుంటారు. అదే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇద్దరు యువకులు ఫైజల్, అల్బీ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతుంటారు. అయితే సీఐ అలెక్స్ వీరి కోసం వెతుకుతుంటాడు. మినిస్టర్ మూసాకి నమ్మిన బంటు అల్బీ.. దాంతో అతను బంగారం స్మగ్లింగ్ చేయడానికి సహాయం చేస్తుంటాడు. అల్బీ, ఫైజల్ తో చేతులు గలిపి ఆ బంగారాన్ని అమ్మాలనుకుంటాడు. మరి మూసాకి తెలియకుండా అల్బీ బంగారాన్ని అమ్మగలిగాడా? ఈ క్రమంలో ఫైజల్ మరియు అతని ఫ్యామిలీ ఎదుర్కొన్న సమస్యలేంటి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
పూర్వం బంగారంపై ఉన్న అత్యాశతో ఒక మనిషి మరో మనిషిని చంపుకుంటారని చూపిస్తూ కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. ఇక ప్రస్తుతం సమాజంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడిన వారిలో సగం మంది రాజకీయ నాయకుల చేతిలోని వారే.. దాన్నే ప్రస్తావిస్తూ బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మృదుల్ నాయర్.

కథలో కాసర్ గోల్డ్ అనే రైల్వే స్టేషన్ లో బంగారం తీసుకొచ్చినట్టు చూపిస్తూనే అదే ప్రాంతంలో ఉండే అడవిలో బంగారం పోయినట్టుగా కనెక్ట్ చేశాడు. ‌ఇక అదే అడవిలో చివరగా వారు మరణిస్తారని తీసిన విధానం బాగుంది. అయితే ఈ  కథ అంతా బంగారమ చుట్టూనే తిరగడం వల్ల కొన్ని పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇక మరికొన్ని సీన్లు అదనంగా పెట్టారనిపిస్తుంది.

బంగారం దొరికిన తర్వాత మనుషుల స్వభావం ఎలా మారుతుందో అల్బీని చూపిస్తూ, ఆ స్మగ్లింగ్ లో భాగంగా ఫైజల్ ఇరుక్కుపోవడం.. తన ఫ్యామిలీ కోసం అతను పోరాడే విధానం బాగుంటుంది‌‌. అయితే ఈ క్రమంలో కొంతమంది రౌడీలు వీరిద్దరిని చంపడానికి రావడం, అలాగే పోలీసులు వీళ్ళిద్దరి కోసం గాలిస్తుంటారు. వారిని తప్పించుకోనే క్రమం బాగుంటుంది. అయితే ఒకానొక క్రమంలో అల్బీ, ఫైజల్ ఇద్దరు ఇక పోలీసులకి లొంగిపోదామనుకుంటారు. అయితే సీఐ అలెక్స్ వారిని ఎన్ కౌంటర్ చేసేస్తాడు. దాంతో కథ ముగిసిందని అందరు భావిస్తారు. కానీ ఇక్కడే మరో కొత్త మొదలవుతుందంటూ డైరెక్టర్ మృదుల్ ఇచ్చిన ట్విస్ట్  కట్టిపడేస్తుంటుంది. సినిమా మొత్తం బంగారం, దాని మీద ఆశతో ఒకరిని మించి ఒకరు ఎత్తుకి పైఎత్తులు వేయడమే. 

కథ మొదటి ఇరవై నిమిషాలు, చివరి ఇరవై నిమిషాలు బాగుంటుంది. మిగతా కథలో మొత్తం కొత్త క్యారెక్టర్లు వస్తుంటాయి. వారు ఎందుకు అల్బీ, ఫైజల్ ని ఫాలో అవుతున్నారో అర్థం కాదు. అసలు వీళ్ళెవరి మనుషులనే కన్ఫూజన్ ప్రేక్షకుడికి ఎదురవుతుంది. కథలో ఆ గోవాలో జరిగే సీన్లు ఎందుకున్నాయా అనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేకపోయిన కొన్ని హింసాత్మక సీన్లు భయాన్ని కలిగిస్తాయి.

జెబిన్ జాకబ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొండప్రాంతాల్లో‌ తీసిన కొన్ని డ్రోన్ షాట్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. విష్ణు బెజోయ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మనోజ్ కన్నోత్ ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని అనసర సీన్లని తీసేస్తే బాగుండేది‌. సాజిమోన్ ప్రభాకర్ రాసుకున్న కథని మృదుల్ సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
అల్బీగా ఆసిఫ్ అలీ చక్కగా చేశాడు. సన్నీ వేన్ గా ఫైజల్ ఆకట్టుకున్నాడు. సీఐ అలెక్స్ గా వినాయకన్ నటన కట్టిపడేస్తుంది. డ్యూటీ లో సిన్సియారిటికి అద్దంలా సీఐ అలెక్స్ చేశాడనిపిస్తుంటుంది. ఫైజల్ ఫ్యామిలీతో కలిసి గడిపే  కొన్ని క్షణాలు కట్టిపడేస్తాయి. మూసాగా సిద్దిక్, సంపత్ రామ్ వారి పాత్రమేరకు నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
అత్యాశ మనిషిని నాశనం చేస్తుందనేది చెప్తూ తీసిన ఈ 'కాసర్ గోల్డ్' సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. 

రేటింగ్: 2.25/5

✍🏻. దాసరి మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.