![]() |
![]() |
సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయి. ‘జైలర్’లో కీలక పాత్ర పోషించిన మారిముత్తు మరణ వార్త మరచిపోకముందే, మలయాళ దర్శకుడు కె.జి.జార్జ్ ఓ వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండానే దర్శకనిర్మాత జయదేవి మరణించారు. తాజాగా టాలీవుడ్‌లో నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఆ మరుసటి రోజే నాజర్ తండ్రి మోహబూబ్ బాషా తుది శ్వాస విడిచారు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటి భైరవి వైద్య ఇక లేరన్న వార్త ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న భైరవి మరణించారని ఆమె కుమార్తె జాంకీ వైద్య సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
భైరవి వైద్య పలు గుజరాతీ, హిందీ చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కూడా చాలా సీరియల్స్‌లో నటించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 8న తుది శ్వాస విడిచారు. 45 ఏళ్ళపాటు సినీ పరిశ్రమలో నటిగా కొనసాగిన ఆమె ‘తాళ్’, ‘చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే’, ‘వాట్స్ యువర్ రాషీ’, ‘హమ్ రాజ్’, ‘క్యా దిల్ నే కహా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే బుల్లితెరపై పలు ధారావాహికలతోపాటు హస్రతీన్, మహిసాగర్ వంటి షోలో పనిచేశారు. ఆమె ఇటీవల నిమా డెంజోంగ్పా అనే టీవీ షోల్లో కనిపించారు. భైరవి వైద్య మరణం పట్ల బాలీవుడ్, గుజరాతీ సినీ పరిశ్రమలు తమ సంతాపాన్ని తెలియజేశాయి.
![]() |
![]() |