![]() |
![]() |

విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మార్క్ ఆంటోనీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఈరోజు(సెప్టెంబర్ 15) ప్రేక్షకులను పలకరించింది.
'మార్క్ ఆంటోనీ' కథ విషయానికొస్తే.. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అయిన ఆంటోనీ(విశాల్) గ్యాంగ్ వార్ లో చనిపోతాడు. దీంతో అతని కుమారుడు మార్క్(విశాల్)ని ఆంటోనీ స్నేహితుడు జాకీ(ఎస్.జె. సూర్య) చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. తన తల్లి చావుకి తండ్రే కారణమని, తన తండ్రి దుర్మార్గుడు అని చిన్నతనం నుంచే ఆంటోనీపై మార్క్ అసహ్యం పెంచుకుంటాడు. అయితే ఓ సారి మార్క్ కి అనుకోకుండా టైం ట్రావెల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ ద్వారా గతంలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి కడిగిపారేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి, తల్లి మరణం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు మార్క్ తల్లి మరణానికి కారకులు ఎవరు? తండ్రి గురించి మార్క్ తెలుసుకున్న నిజం ఏంటి? మార్క్ తన తల్లిదండ్రులను బ్రతికించుకోగలిగాడా? ఈ కథలో జాకీ(ఎస్.జె. సూర్య) పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాకి దర్శకుడు టైం ట్రావెల్ ఫోన్ కాన్సెప్ట్ ని తీసుకొని, దానిని వినోదభరితంగా చెప్పాలనుకున్నాడు. అందులో సగం విజయం సాధించాడు. ఆంటోనీ హత్య, టైం ట్రావెల్ ఫోన్ కనిపెట్టడం వంటి సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. 20 సంవత్సరాల తర్వాత మార్క్ పాత్ర పరిచయం, అతని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. ఇక జాకీ పాత్రని మలిచిన తీరు బాగుంది. ఆ పాత్ర నవ్వులు పూయిస్తుంది. మార్క్ కి టైం ట్రావెల్ ఫోన్ దొరికిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ సన్నివేశాల వరకు సినిమా నడిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అయితే సెకండాఫ్ మాత్రం చేతులెత్తేసింది. ఫస్టాఫ్ కి సెకండాఫ్ పూర్తి రివర్స్ లో ఉండి.. కాస్త గందరగోళాన్ని కలిగిస్తుంది. ఫస్టాఫ్ లో చూస్తున్న పాత్రలనేనా మనం సెకండాఫ్ లో చూస్తున్నది అనే అనుమానం కలుగుతుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ, సినిమాని సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. జాకీ(ఎస్.జె. సూర్య) పాత్ర అక్కడక్కడా నవ్వించినప్పటికీ.. నెమ్మదిగా సాగే కథనం ఇబ్బంది పెడుతుంది. ముగింపు కూడా గొప్పగా లేదు. మొత్తానికి 'మార్క్ ఆంటోనీ' చిత్రం కొంచెం వినోదం, కొంచెం గందరగోళం అన్నట్టుగా ఉంది.
![]() |
![]() |