
మణిరత్నం డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చెయ్యాలని హీరోలు కోరుకుంటారు. అయితే అలాంటి అవకాశం కొద్దిమందికి మాత్రమే దక్కింది. అలాగే అతని డైరెక్షన్‌లో రెండో ఛాన్స్ వచ్చిన హీరోలు కూడా తక్కువమందే వున్నారు. ఉదాహరణకు కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందించిన ‘నాయకుడు’ విడుదలై ఇప్పటికి 36 సంవత్సరాలు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవ్వలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక రజనీకాంత్, మమ్ముటి కాంబినేషన్‌లో మణిరత్నం చేసిన ‘దళపతి’ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి 28 సంవత్సరాలైంది. వీరి కాంబినేషన్‌లో కూడా మణిరత్నం సినిమా చెయ్యలేదు. ఇక మణిరత్నం తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ ఒకే ఒక్కటి. అదే నాగార్జునతో చేసిన ‘గీతాంజలి’. ఈ సినిమా విడుదలై 34 సంవత్సరాలు. అలాగే షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ‘దిల్‌సే’ విడుదలై 25 సంవత్సరాలైంది. ఇప్పటివరకు వీరితో సినిమా చెయ్యలేదు.
ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే తనతో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన హీరోలను రిపీట్ చెయ్యడానికి మణిరత్నం రెడీ అవుతున్నారు. కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కమల్‌హాసన్ 234వ సినిమాగా ఇది రూపొందనుంది. భారీ తారాగణంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండడం విశేషం. అంతేకాదు ఈ సినిమా కోసం శింబుని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత సూర్య కోసం ప్రయత్నాలు చేశారు. అతను కూడా సెట్ కాకపోవడంతో ఇప్పుడు విక్రమ్‌తో ఆ క్యారెక్టర్ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఒకే సినిమాలో ఇంత మంది స్టార్స్ నటించడం నిజంగా విశేషమే. మరి ఈ సినిమాని ఏ రేంజ్‌లో తీస్తారో, ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో చూడాలి.