![]() |
![]() |

'ఖుషి' సినిమాకి హిట్ టాక్ వచ్చిన ఆనందంలో తన రెమ్యునరేషన్ నుంచి కోటి రూపాయలను వంద కుటుంబాలకు లక్ష చొప్పున ఇస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ గొప్ప మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ మాత్రం ఊహించని షాకిచ్చింది. వంద కుటుంబాలకు కోటి ప్రకటించి మీ గొప్ప మనసుని చాటుకున్నారు సరే.. మరి మీ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు నష్టపోయిన మా పరిస్థితి ఏంటి? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
మూడేళ్ళ క్రితం వచ్చిన సినిమా నష్టాల గురించి, ఓ నిర్మాత సంస్థ ట్విట్టర్ వేదికగా నేరుగా హీరోని అడగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ అభిమానులు సహా పలువురు అభిషేక్ పిక్చర్స్ తీరుని తప్పుబడుతున్నారు. సినిమా అనేది వ్యాపారం.. లాభనష్టాలు సహజం.. ఏదైనా సమస్య ఉంటే నిర్మాతతో మాట్లాడుకోవాలి కానీ ఇలా హీరోని పబ్లిక్ గా అడగటం ఏంటి?.. బడా ఫ్యామిలీకి చెందిన సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను కూడా ఇలాగే ప్రశ్నించగలరా?.. అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ఇలా పబ్లిక్ గా హీరోని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం అనేది అభిషేక్ పిక్చర్స్ తొందరపాటు చర్య అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా సన్నిహితులు మాత్రం అలా ట్వీట్ వెనుక బలమైన కారణం, ఎంతో ఆవేదన ఉందని అంటున్నారు. అదేంటంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన అభిషేక్ నామా.. విజయ్ ని ఒక రిక్వెస్ట్ చేశారట. మీ మార్కెట్ ప్రకారం మీరు రెమ్యునరేషన్ తీసుకొని, మా బ్యానర్ లో ఒక సినిమా చేసి పెట్టండి, ఆ నష్టాల నుండి బయటపడతాం అని అడిగారట. కానీ విజయ్ నో చెప్పడంతో.. అభిషేక్ నామా ఎంతో ఆవేదన చెందారట. మరోవైపు 'వరల్డ్ ఫేమస్ లవర్'ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ కూడా ప్రొడక్షన్ లో యాక్టివ్ గా లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలా ట్వీట్ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఒక హీరోని టార్గెట్ చేస్తూ ఇలా ట్వీట్ చేయడమనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
![]() |
![]() |