![]() |
![]() |
క్రికెటర్ల జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని ఇటీవలి కాలంలో సినిమాలు వచ్చి విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రూపొందుతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేసిన ముత్తయ్య మురళీధరన్ స్పిన్నర్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందే సినిమాకు 800 అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తుండగా, మది మలర్ పాత్రలో మహిమ నంబియార్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ ముఖ్యఅతిథిగా హాజరై ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇండియా తరఫున సచిన్, శ్రీలంక తరఫున మురళీధరన్ ఎన్నో మ్యాచ్ లలో ఆడారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ బంధం కారణంగానే సచిన్ ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమిళంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకున్నారు. ఈ సినిమా రైట్స్ ను పొందటం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సచిన్ టెండూల్కర్ హాజరు కావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. సచిన్ తో పాటు మరికొందరు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషషన్స్ ను ట్రైలర్ రిలీజ్ తర్వాత ముమ్మరం చేయనున్నారు.
![]() |
![]() |