![]() |
![]() |
ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, నిర్మాత పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు లాభాలు వచ్చినా యూనిట్‌లోని కీలక వ్యక్తులకు డబ్బు రూపేణాగానీ, గిఫ్ట్‌ల రూపేణాగాని ఇవ్వడం చాలా అరుదు. నిర్మాత కళానిధి మారన్ మాత్రం అందుకు భిన్నంగా తమ సినిమా విజయానికి కారణమైన వారందరికీ బహుమతులు అందిస్తున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి రూ.100 కోట్ల చెక్‌తోపాటు ఓ ఖరీదైన కారును కూడా బహుమతిగా అందించారు. తాజాగా డైరెక్టర్ నెల్సన్ ఇంటికి వెళ్ళిన మారన్ అతనికి కూడా ఓ భారీ చెక్‌ను అందించారు. అంతటితో ఆగకుండా ఓ ఖరీదైన కారును బహూకరించారు. ముఖ్యమైన వారిలో ఇక మిగిలింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ‘జైలర్’ సినిమాకి అద్భుతమైన పాటలతో పాటు, సూపర్బ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. నిర్మాత మారన్ నుంచి తదుపరి చెక్, బహుమతి అందుకోబోయే వ్యక్తి అతనేనని తెలుస్తోంది. ‘జైలర్’ ఇంత పెద్ద హిట్ అయి నిర్మాత మారన్‌పై కనకవర్షం కురిపించడానికి ముఖ్య కారణం రజనీకాంతే. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వయసెంత పెరిగిన రజనీ హవా ఏమాత్రం తగ్గలేదని ‘జైలర్’ మరోసారి ప్రూవ్ చేసింది. రజనీకాంత్ కాంబినేషన్‌లో కళానిధి మారన్ చేసిన ‘రోబో’ అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పేట’, ‘అన్నాత్తై’ చిత్రాలు ఆశించిన సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ‘జైలర్’తో ఈ కాంబినేషన్ అనూహ్యమైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
![]() |
![]() |