![]() |
![]() |

ప్రకాష్ రాజ్ కి నటుడిగా ఎంత టాలెంట్ వుందో అందరికీ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా మరో కొత్త వివాదంతో వార్తల్లోకి వచ్చారు ప్రకాష్ రాజ్. ఇటీవల ఇస్రో శాస్ర్తవేత్తలు చంద్రయాన్ 3 ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ పేరుతో నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 చంద్రుడిపై ఎప్పుడు అడుగుపెడుతుందా అని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వకుండానే బ్లాస్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3పై ఇస్రో శాస్త్రవేత్తలతో సహా భారతీయులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా చంద్రయాన్ 3 ప్రయోగంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన ట్విట్టర్ ఖాతాలో ఒక చాయ్ వాలా ఫోటోను పోస్ట్ చేస్తూ... చంద్రుడి ఉపరితలం పై నుంచి విక్రమ్ ల్యాండర్ పంపిన మొదటి ఫోటో ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది దేశాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రధాని మోదిని ఉద్దేశించే ఆ ఫోటోను పోస్ట్ చేశారని నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.. చంద్రయాన్ 3 యావత్ భారతదేశానికి గర్వకారణమైన ప్రయోగమని, దీనికి రాజకీయ రంగు వేయొద్దని అందరూ కోరుతున్నారు.
దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. తాను నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ చెప్తూ కేరళ చాయ్ వాలా ఫోటోను పోస్ట్ చేశానని, నన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు అది ఏ చాయ్ వాలా ఫోటో అనుకుంటున్నారని
ప్రశ్నించారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో.. ప్రకాష్ రాజ్ కి ఎన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి మరి
![]() |
![]() |