Home  »  News  »  కోర్టులో 'భోళా శంకర్' భవితవ్యం.. వైసీపీ ఆట మొదలైందా?

Updated : Aug 9, 2023

అసలే ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన తమిళ సినిమా 'వేదాళం'కి రీమేక్ కావడంతో 'భోళా శంకర్' ఫలితం ఏమవుతుందా అనే ఆందోళన మెగా అభిమానుల్లో ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల వేళ మెగా అభిమానుల్లో కొత్త భయం మొదలైంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుని ఆశ్రయించారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు 30 కోట్లు తీసుకుని తనను నమ్మించి మోసం చేశారని డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. "ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేశారు. 'ఏజెంట్' తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఐదేళ్ళ పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చి 30 కోట్లు తీసుకుని మరీ వారు నన్ను మోసగించారు. మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను డబ్బు చెల్లించినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ, వారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను.. విడుదల సమయంలో  కేవలం విశాఖ వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని వారి ఆఫీస్ కు వెళ్లి అడిగితే, అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చారు. అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో ఉన్నాను. ఆ తర్వాత వారు చేసిన 'సామజవరగమన' చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖ వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. దీంతో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి  సినిమా విడుదలలోపు ఇస్తామని నాకు ఒప్పంద పత్రం చేశారు. వారి తదుపరి సినిమా 'భోళా శంకర్'. అయితే కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితులలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం జరిగింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన సినిమా అన్న ఉద్దేశ్యంతోనే నేను ఆచితూచి, ఇంతవరకు ఎక్కడా మీడియాకు ఎక్కకుండా ముందుకు సాగాను. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు. అందుకే న్యాయ పోరాటానికి దిగాను. నిజాయితీ, న్యాయం గెలుస్తాయని నేను నమ్ముతున్నాను. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం" అని వైజాగ్ సతీష్ తెలిపారు.

ఈ కేసు కారణంగా 'భోళా శంకర్' విడుదలకు ఆటంకాలు ఏర్పడుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో 'భోళా శంకర్' విడుదలను అడ్డుకోవడానికి ఏపీ అధికార పార్టీ వైసీపీ ఏమైనా ఆట మొదలుపెట్టిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన 'వాల్తేరు వీరయ్య' 200 రోజుల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమా వాళ్ళపై మీ ప్రతాపం చూపించడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. దీంతో మొన్నటిదాకా చిరంజీవిని పొగిడిన అధికార పార్టీ నేతలే.. ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నారు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' విడుదల సమయంలో చేసినట్లుగా 'భోళా శంకర్'ని కూడా ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారా అనే అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ కోర్టు కేసు వెనక కూడా వైసీపీ ఉందా అనే అనుమానం కొందరిలో ఉంది. అయితే ప్రస్తుతానికైతే దీని వెనుక వైసీపీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేయకముందే.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై వైజాగ్ సతీష్ న్యాయ పోరాటానికి దిగారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.