Home  »  News  »  ఆర్జీవీ 'వ్యూహం' టీజర్ రియాక్షన్.. భారతి ఎందుకు నవ్వింది?

Updated : Jun 24, 2023

 

ఓ వైపు ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. మన ముఖ్యమంత్రి జగనన్న అని ఎప్పటికీ అనిపించుకోవాలని ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగా జగనన్న వదిలిన మరో బాణం.. 'వ్యూహం'. సీనియర్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో.. అంటే ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విడుదల చేయనున్నారని సమాచారం. ఈ మూవీ టీజర్‌ ఈరోజు విడుదలైంది. 2 నిమిషాల 45 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్‌లో "అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు" అంటూ జగన్ పాత్రలో ఉన్న అజ్మల్ చెప్పిన ఒక్క డైలాగ్ తప్ప.. మరో డైలాగ్ లేకపోవడం గమనార్హం. 

మరోవైపు టీజర్‌లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తుండడంతో ప్రారంభమైన ఈ టీజర్.. అజ్మల్ చెప్పే ఒక్కే ఒక్క డైలాగ్‌తో ముగుస్తుంది. దీంతో ఈ టీజర్.. మహానేత మరణం నుంచి జగన్ ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రజలకు అభివాదం చేస్తుండడం.. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబుని కాదంటూ అచ్చుగుద్దినట్లు జగన్ టోన్‌తో చెప్పడంతో ఈ టీజర్ ముగుస్తుంది.

ప్రారంభం నుంచి ముగింపు వరకు.. అంతా సీరియస్‌గా సాగిన ఈ టీజర్‌లో కాసిన్ని కన్నీళ్లు, కూసింత ఆందోళన, మరికొంత ఆదుర్దాతోపాటు వైయస్ జగన్ భార్య భారతి నవ్వుతూ.. తన భర్తకు మనస్పూర్తిగా.. అదీ తన మామ వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో సాక్షిగా షేక్ హ్యాండ్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే వాయువేగంతో వైరల్ అవుతోంది. 

ఈ చిత్రంలో వైయస్ భారతి నవ్విన నవ్వు దేనికి సంకేతమని వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ షేక్ హ్యాండ్‌.. తన చిన్న మామ వైయస్ వివేక దారుణ హత్య వార్త విని.. ఈ విధంగా స్పందించారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వైయస్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సెల్ కాల్ డేటా లిస్ట్‌లో వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే వైయస్ భారతి పీఏ నవీన్‌ల సెల్‌కు అర్ధరాత్రి వేళ.. అంటే వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో కాల్స్ వెళ్లినట్లు సీబీఐ అధికారులు.. కోర్టుకు తెలిపారు. 

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఓఎస్డీ, భారతీ పీఏ నవీన్‌లను సీబీఐ విచారించిందని... అలాంటి వేళ ఈ షేక్ హ్యాండ్.. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన వేళ.. చేసుకొన్న షేక్ హ్యాండ్‌యేనా అని నెటిజన్లు సందేహాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుంటే.. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురైనందుకా... అంటే అనుకున్నది అనుకున్నట్లుగా.. ముఖ్యమంత్రి పీఠాన్ని తన భర్త వైయస్ జగన్ అధిరోహించినందుకా?.. ఈ షేక్ హ్యాండ్ అనే ఓ విధమైన మీమాంసలో నెటిజన్లు ఉండిపోయారు.  

అంతేకాదు, ఈ టీజర్‌లో చంద్రబాబును చూపించే ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఫొటోపై కెమెరాను ఫోకస్ చేసి.. ఆ తర్వాత చంద్రబాబును చూపించడం విశేషం. ఇక ఈ టీజర్‌లో ఒకే ఒక్క డైలాగ్.. అదీ జగన్ చెప్పిందీ.. అలా ఆలోచించడానికి  నేను చంద్రబాబుని కాదని.. ఇది అక్షరాల నిజమేనని .. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. చంద్రబాబు ఆలోచన తీరు ఎలా ఉంటుందో.. వైయస్ జగన్ ఆలోచన సరళి ఎలా ఉంటుందో వరంగల్‌కు చెందిన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ 'వ్యూహం'.. జగన్‌కు సంబంధించి ఫలిస్తుందా? లేక వికటిస్తుందా? అనేది తెలియాలంటే.. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు. 

ఇదివరకు ఆర్జీవీ తీసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు) సినిమాలో చంద్రబాబు, జగన్ పాత్రల్ని పోషించిన ధనంజయ్ ప్రభునే, అజ్మల్ అమీర్ వ్యూహంలోనూ అవే పాత్రల్ని పోషించడం గమనార్హం. భారతి పాత్రను మానస చేశారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.