Home  »  News  »  'ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు'.. తగ్గేదేలే!

Updated : Feb 28, 2023

ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు'. రాజేంద్రప్రసాద్,‌ మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటించారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం విశేషం. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్‌.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ప్రతి క్యారెక్టర్‌ రాసుకోవడం జరిగింది. తెరమీద పాత్రలు మిమ్మల్ని నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని నేను మార్చి 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను. మద్రాసులో ఉన్నప్పుడు నా సినిమాల ప్రివ్యూలకు వెళ్లి జనాన్ని గమనిస్తూ ఉండేవాళ్లం. ఏఏ సీన్‌లు ప్రజలను ఆకట్టుకున్నాయి.. ఎక్కడ జనాల మొహాల్లో రియాక్షన్స్‌ వస్తున్నాయి.. ఎన్ని సీన్‌లు పండాయి అని లెక్కలేసుకునే వాళ్లం. ఇది ఒక మేకర్‌కు చాలా అవసరం. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలు ఒకటి.. ఈ సినిమా నిర్మాత కల్పన గారు ఒకటి. ఎందుకంటే.. ఇంతకు ముందు నేను నా నిర్మాతను ఏ ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ను అడిగితే వారిని తెచ్చేవారు. కానీ కల్పన గారు మాత్రం నేను అడిగిన రేంజ్‌ వారికన్నా తగ్గేదేలే అంటూ ఇంకా పై రేంజ్‌ ఉన్న వారిని తీసుకొచ్చారు.. అందుకే ఈవిడ స్పెషల్‌ అని చెప్పేది" అన్నారు.

హీరో సోహైల్‌ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను అని చాలాసార్లు చెప్పాను. 90ల్లో కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. అన్ని రంగాల్లోకి టఫ్‌ రంగం సినిమా. అందరూ సక్సెస్‌ వస్తే లైఫ్‌ సెటిల్‌ అయిపోయింది అంటారు. కానీ సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్‌ మొదలౌతుంది. ఎన్నో టెన్షన్స్‌తో థియటేర్స్‌కు వచ్చే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ... వారి కష్టాలను మర్చిపోయేలా చేయడమే ఆర్టిస్ట్‌ల బాధ్యత. ఈ సినిమాలో ఆ బాధ్యతను 100 శాతం నెరవేర్చామని ఫీలవుతున్నా. నా ప్లేస్‌లో మరో హీరో ఎవరైనా ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది. కానీ నా టాలెంట్‌ను గుర్తించి నన్ను ఈ సినిమాలో హీరో పాత్రకు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా అందరూ థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయిన మా 'ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు' చూసి, మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా" అన్నారు. 

ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. "అందరం చాలా ఉత్సాహంగా, ఆతృతగా మార్చి 3 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా అద్భుతంగా రావటానికి ఏం చేయాలో అది ఎవరి పరిధిలో వారు ది బెస్ట్‌ అన్నట్టుగా చేశారు. తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణారెడ్డి గారు సంపాదించిన గుడ్‌విల్‌ను మరింత పెంచే సినిమా 'ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు'. ఈ సినిమా ఇంత గొప్పగా రావటానికి రాజేంద్రప్రసాద్‌, మీనా, సొహైల్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌తో పాటు, నిర్మాత కల్పన గారి రాజీపడని తత్వం ప్రధాన కారణం. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ కృష్ణారెడ్డి గారు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అన్నారు.

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ.. "అందరూ అంటుంటారు... ఆ తరం ఐపోయింది. ఈ తరం ఐపోయింది అని. కానీ నా దృష్టిలో తరాలు మారొచ్చు గానీ.. సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. సినిమా అనేది ఒక పరుగు లాంటిది. భావాన్ని బట్టి యాక్షన్‌, సన్నివేశాన్ని బట్టి సంగీతం ఇవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల పాయింట్‌లు 20 సంవత్సరాల క్రితం వచ్చినవే. కాకపోతే కొత్త కొత్త హంగులు, ఆకర్షణలతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు, కుటుంబంలో ఉండే ప్రేమానుబంధాలను అద్భుతంగా చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఇందుకు ఉదాహరణగా ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను చెప్పాలి. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు ఖచ్చితంగా చెమర్చేలా ఈ ఎపిసోడ్‌ను ఆయన తెరకెక్కించారు. ఇందులో ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు.. కానీ భావం మన మనసును ద్రవింపజేస్తుంది. అంత ట్రెండీగా తీశారు కృష్ణారెడ్డి గారు. సన్నివేశాలు అయినా.. సంగీతం అయినా కృష్ణారెడ్డిగారి ముద్రలోంచి ఎక్కడా బయటకు రావు. ఏ సినిమా అయినా విడుదలైన తర్వాతే అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అని డిసైడ్‌ అయ్యేది. ఈ సినిమా కూడా రిలీజ్‌ తర్వాత పెద్ద విజయం సాధించి పెద్ద సినిమాగా మారుతుంది. ఖచ్చితంగా దీని తర్వాత కృష్ణారెడ్డి గారిని పెద్ద నిర్మాతలు డేట్స్‌ అడుగుతారు. నిర్మాతగా కల్పనకు డేర్‌ ఎక్కువ. ఈ సినిమా కోసం ఆమె పెట్టిన ఖర్చు నాకు ఆశ్చర్యం వేసింది. ఆమెకు సినిమా మీద ఉన్న నమ్మకం అది. సోహెల్‌కు ఈ చిత్రం తర్వాత మంచి మార్కెట్‌ వస్తుంది. దాన్ని అతను నిలబెట్టుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అజయ్‌ ఘోష్‌ మంచి టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌. మీనా నిర్మాతల ఆర్టిస్ట్‌. రాజేంద్రప్రసాద్‌ గారితో నేను 9 సినిమాలు చేశాను. చాలా కంఫర్టబుల్‌ ఆర్టిస్ట్‌. నా కుటుంబ సభ్యుడితో సమానం." అన్నారు. 

నటుడు అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ... "కృష్ణారెడ్డి గారి సినిమాలో నటించడం నా అదృష్టం. సి. కల్యాణ్‌ గారు నిర్మించిన 'జ్యోతిలక్ష్మి' సినిమా వల్ల నేను ఈరోజు అన్నం తింటున్నాను. ఆయన భార్య కల్పన గారు నిర్మించిన ఈ చిత్రంలో నటించడం నాకు ఆనందంగా ఉంది. ప్రొడక్షన్‌ మీద ఆమె ప్రేమ, కమాండ్‌ చూసి ఆశ్చర్యపోయా. కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసినా, అందులో నటించినా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే దెబ్బకు ఎగిరి పోతాయి. అంత పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది ఆయన సినిమాల్లో. నా మనసును టచ్‌ చేసిన సినిమా ఇది." అన్నారు.

సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సి. రాంప్రసాద్‌, ఎడిటర్ గా ప్రవీణ్‌ పూడి వ్యవహరిస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.