Home  »  News  »  మాలికాపురం మూవీ రివ్యూ!

Updated : Feb 17, 2023

సినిమా: మాలికాపురం
తారాగణం : ఉన్ని ముకుందన్,   దేవ నంద,  శ్రీపత్, సైజు కురుప్, సంపత్ రామ్, మనోజ్ కె. జయన్, రమేశ్ పిశరోడి, శ్రీజిత్ రవి, రెంజి పనీకర్, టి. జి. రవి తదితరులు.
సినిమాటోగ్రఫీ: విష్ణు నారాయణ్
ఎడిటింగ్: మహమ్మద్ షమీర్
సంగీతం: రంజిన్ రాజ్
కథ: అభిలాష్ పిళ్ళై
దర్శకత్వం & ఎడిటింగ్: విష్ణు శశి శంకర్
నిర్మాతలు: నీతూ పింటో, ప్రియా వేణు
బ్యానర్: గీత ఆర్ట్స్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్.


మాలికాపురం అనగానే ఏదో ఒక ఊరిపేరు అనే అనుకుంటారందరూ కానీ పూర్వం ఈ పేరుతో ఒక ఆచారం కొనసాగేదని చెప్తూ వచ్చిందే ఈ మూవీ. మలయాళంలో తెరకెక్కిన భక్తి కథా చిత్రం ' మాలికాపురం'. అయ్యప్పస్వామి మాలాధరణ ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం...

కథ: 

కేరళలోని ఒక ఊరిలో షన్ను(దేవ నంద) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మనాన్నలతో కలిసి ఉంటుంది. చిన్నతనం నుండి షన్నుకి వాళ్ళ నానమ్మ అయ్యప్ప స్వామి గురించి కథలుగా చెప్తూ, ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అలా షన్ను శబరిమలై వెళ్ళి అయ్యప్పని చూడాలని ప్రతీరోజు కలలు కంటుంది. మరోవైపు వాళ్ళ నాన్న ఏ పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతూ, కుటుంబ అవసరాల కోసం చాలా అప్పులు చేస్తాడు. షన్ను ఇంటిపక్కన ఉన్న తన స్నేహితుడు అయిన బుజ్జి(శ్రీపత్) తో కలిసి ప్రతీరోజు స్కూల్ కి వెళ్తుంటుంది.‌ అయితే షన్ను శబరిమలై వెళ్దామని వాళ్ళ నాన్నతో చెప్పిన ప్రతీసారీ వెళ్దామని చెప్తూ మాట దాటేసేవాడు. ఒక రోజు అప్పు ఇచ్చినవాడు వచ్చి షన్ను నాన్నని తన కళ్ళ ముందే అందరూ చూస్తుండగా కొడతాడు.‌ దీంతో మనస్తాపానికి గురైన అతను చనిపోతాడు. ఆ తర్వాత షన్ను శబరిమలై వెళ్ళిందా? లేదా? తనని శబరిమలైకి ఎవరు తీసుకెళ్ళారు? అనేది తెలుసుకోవాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ మూవీ చూడాల్సిందే..

విశ్లేషణ: 

కేరళలోని కొన్ని గ్రామాలలో నివసించే వాళ్ళు నమ్మే సంప్రదాయాలలోని భాగం ఈ 'మాలికాపురం'. పూర్వం పాండ్య రాజులు యుద్ధం తర్వాత వారి కులదైవం అయినటువంటి మీనాక్షీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక ఊరిలో ఉండి.. అక్కడ అమ్మవారికి పూజలు చేస్తుండేవారు. అయితే ఇక్కడివాళ్ళు ఊరి నుండి శబరిమలైకి  పద్దెనిమిది కొండలు దాటి వెళ్ళి.. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అలా స్వామిని దర్శించుకునేవారిలో పదేళ్ళలోపు ఆడపిల్లలు స్వామి మాల వేసుకొని వెళ్తే.. ఈ కన్నె స్వాములను అక్కడివాళ్ళంతా 'మాలికాపురం' అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ మూవీలో షన్ను స్వామి మాల వేసుకుంటుంది కాబట్టి తనని మాలికాపురం అనే పేరుతో పిలుస్తారు.

కథ ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినా.. షన్ను నాన్న చనిపోయాక నుండి కథలో మలుపులు తిరుగుతుంటాయి. ద్వితీయార్థంలో ఉన్ని ముకుందన్ వచ్చాక కథ ‌ఆసక్తికరంగా మారుతుంది. షన్ను అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనే కోరికని చివరివరకు తీసుకెళ్ళిన తీరు ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లలతో భక్తి కథాచిత్రాలు చాలానే చూశాం. గతంలో వచ్చిన 'దేవుళ్ళు' సినిమా ఇలాంటి కోవకే చెందింది.  

అభిలాష్ పిళ్లై ఇచ్చిన కథని చాలా బాగా తెరకెక్కించాడు విష్ణు శశి శంకర్.. కథనాన్ని చివరివరకు ఉత్కంఠగా నడిపినతీరు ఆకట్టుకుంటుంది. రంజిన్ రాజ్ సంగీతం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. పాటలు ఆకట్టుకున్నాయి. మహమ్మద్ షమీర్ ఎడిటింగ్ బాగుంది. విష్ణు నారాయణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా భక్తకోటిని ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులను ఆకట్టుకుంటుంది. 

నటీనటుల పనితీరు: 

ఇంతకముందు తెలుగులో 'జనాతా గ్యారేజ్, పంచాక్షరీ, భాగమతి, యశోద' వంటి సినిమాలలో నటించిన మళయాళ నటుడు 'ఉన్ని ముకుందన్'.. ఈ మూవీలో ప్రధాన పాత్రను పోషించాడు. అయ్యప్పగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. పాప షన్నుగా దేవ నంద అభినయాన్ని చూపింది. షన్ను నాన్నగా సైజు కురుప్ ఒదిగిపోయాడు. షన్నుకి స్నేహితుడిగా, రాజ్ అన్నయ్యగా శ్రీపత్ మెరిసాడు. మనోజ్ కె. జయన్ సీఐ గా ఉన్నంతలో బాగా చేశాడు.  మిగతావాళ్ళు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్: 

శబరిమలై దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఉండే ఆచారాలను, వారికి అయ్యప్ప స్వామిపై ఉండే భక్తి ప్రధానంగా చూపించిన ఈ 'మాలికాపురం' సినిమాని కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా. దైవభక్తి ఉన్నవారు ముఖ్యంగా అయ్యప్ప భక్తులు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. 

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.