Home  »  News  »  'బుట్ట బొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుంది!

Updated : Jan 19, 2023

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ'. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నటి అనిఖా సురేంద్రన్‌ మీడియాతో ముచ్చటించి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది?
ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది.

బుట్టబొమ్మ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
అప్పటికే ఈ సినిమా మాతృక చూసి ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను.

సినిమాలో ఏమైనా మార్పులు చేశారా?
మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. 

మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
హీరోయిన్ గా నటించడం ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను.

మీకు తెలుగు రాదు కదా.. షూటింగ్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా?
తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ గారు ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు.

అర్జున్ దాస్ వాయిస్ విని భయపడిన సందర్భాలు ఉన్నాయా?
అవును ఆయన వాయిస్ లో చాలా బేస్ ఉంటుంది. ఆయన వాయిస్ విని చాలా సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆయన చాలా స్వీట్ పర్సన్.

రీమేక్ చేసినప్పుడు సహజంగానే మాతృకతో పోలుస్తుంటారు కదా.. నటించేటప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించారా?
ముందే చెప్పినట్లుగా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేశారు. అలాగే నేను కూడా ఒరిజినల్ ఫిల్మ్ లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. పాత్రను అర్థం చేసుకొని ఆ సన్నివేశాలకు తగ్గట్లుగా నటించాను.

సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. కొన్ని కొన్ని సన్నివేశాలు చూశాను.. నచ్చాయి. మీతోపాటు సినిమా చూడటానికి ఎంతో ఆస్తికరంగా ఎదురు చూస్తున్నాను.

ఈ సినిమా ద్వారా ఏమైనా నేర్చుకున్నారా?
ఎంతో నేర్చుకున్నాను. దర్శకత్వ విభాగంలో అనుభవమున్న రమేష్ గారు నటన పరంగా ఎన్నో మెలుకువలు నేర్పించారు.

నిర్మాణ సంస్థ గురించి చెప్పండి?
నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారా?
మొదటి సినిమానే సితారలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

మీ తదుపరి చిత్రాల గురుంచి చెప్పండి?
మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.