![]() |
![]() |

తెలుగులో దొందూ దొందే అనే ఒక పదం ప్రచారంలో ఉంటుంది. ఇప్పుడు ఆ సామెత తెలుగు హీరో ఆది సాయికుమార్ కు, తెలుగు-తమిళ హీరో సందీప్ కిషన్ కు సరిగా సూట్ అవుతుందని సెటైర్లు పడుతున్నాయి. సందీప్ కిషన్ నటించిన చిత్రం 'ప్రస్థానం'. ఈ చిత్రంతోనే ఆయనకు మంచి పేరు వచ్చింది. మేనమామలు చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడు అండతో ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ ఆయన కెరీర్ లో ఉన్న ఏకైక హిట్ చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. తమిళంలో హిట్ అయిన 'మానగరం' మాత్రం ఇతనికి బాగానే పేరును తీసుకొని వచ్చింది. ఈ చిత్రం ద్వారానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు, 'విక్రమ్' ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు పరిచయమయ్యారు.
ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగులో 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు 'మైఖేల్' అనే మూవీతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ చిత్రం తనకి కచ్చితంగా మంచి పేరు తెస్తుందనే ఎంతో నమ్మకంగా ఉన్నారు. జయాపజయాలకు అతీతంగా చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
మరోవైపు ఆది సాయికుమార్ విషయానికి వస్తే పీజే శర్మ, సాయికుమార్, అయ్యప్ప శర్మ, రవిశంకర్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ యంగ్ హీరో వాయిస్ మాత్రం తన తండ్రి బాబాయ్‌ల వారసత్వంగా వచ్చింది. ఇంత మంచి బేస్ వాయిస్ ఉన్నప్పటికీ ఆ ఫిజిక్ కి తగ్గ వాయిస్ కాకపోవడంతో అది కూడా మైనస్ గా మారుతోంది. మరి బేస్ వాయిస్ గా ఉండడం వల్ల ఆది సాయికుమార్ మాట్లాడుతుంటే ఏదో డబ్బింగ్ చెప్పిస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా అతనికి కూడా కెరీర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగిన హిట్స్ లేవు.
ఏదో ఒక రెండు మూడు చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. తాజాగా ఆది సాయి కుమార్ సినిమాకి సంబంధించిన ఓ వేడుకకు హాజరైన సందీప్ కిషన్ మాట్లాడుతూ "యంగ్ హీరో ఆదితో నేను ఓ సినిమా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అన్నారు. ఆది తనకు బాగా కావాల్సిన వాడు అని, మంచి నటుడు అని అతనితో ఎప్పటినుంచో సినిమా తీయాలనుకుంటున్నట్టు తెలిపారు. సందీప్ కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కానీ అవేమీ సక్సెస్ కావడం లేదు. కానీ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు.
అలాగే త్వరలో దర్శకునిగా మారుతానని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆది చిత్రానికి ఆయన దర్శకత్వం వహించబోతున్నారా లేదా నిర్మాతగా వ్యవహరించనున్నారా అనేది తేలాల్సి ఉంది. 'ప్రస్థానం' చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ చేసిన సాయికుమార్ కు కుమారుడిగా సందీప్ కిషన్ నటించిన సంగతి తెలిసిందే. మరో కుమారుడిగా శర్వానంద్ నటించారు. అలా సాయికుమార్ తో ఉన్న అనుబంధం వల్లనే ఆది సాయికుమార్ తో సినిమా చేసేందుకు సందీప్ కిషన్ సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
![]() |
![]() |