![]() |
![]() |

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రం ఆగిపోయిందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అది ఆగిపోయిందన్న వార్తలు విని పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే 'భవదీయుడు భగత్ సింగ్' అటకెక్కిందన్న వార్త నిజమే కానీ, పవన్-హరీష్ కాంబోలో సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
పవన్-హరీష్ కలయికలో మైత్రి మూవీ మేకర్స్ 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమైంది. అయితే ప్రస్తుతం పవన్ చేస్తున్న 'హరి హర వీరమల్లు' ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్. దీంతో 'భవదీయుడు భగత్ సింగ్' ఆగిపోయిందని, హరీష్ మరో హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ప్రస్తుతానికి 'భవదీయుడు భగత్ సింగ్'ని పక్కన పెట్టి, పవన్ తోనే మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నట్టు టాక్.
'భవదీయుడు' తెరకెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుందని భావించిన పవన్, మరో కథ సిద్ధం చేయాలని సూచించడంతో.. హరీష్ తనదైన శైలిలో యాక్షన్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ మూవీ లాంచ్ కానుందని, ఆరు నెలల్లో షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇది తమిళ్ మూవీ 'తేరి'(పోలీసోడు)కి రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.
![]() |
![]() |