![]() |
![]() |

బుల్లితెర మీద తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపైనా సత్తా చాటుతున్నాడు. ఫ్లాప్ టాక్ తో కూడా మూడు రోజుల్లోనే రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించాడు. ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోలే ఫ్లాప్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టడానికి కష్టపడుతుంటే.. సుధీర్ మాత్రం ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.
సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గాలోడు' నవంబర్ 18న విడుదలైంది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి, ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా అంచనాలకు మించి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.21 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.1.14 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.61 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 'గాలోడు'.. మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.3.96 కోట్ల గ్రాస్(రూ.2.20 కోట్ల షేర్) రాబట్టినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.4.06 కోట్ల గ్రాస్(రూ.2.25 కోట్ల షేర్) సాధించిందని సమాచారం.
రూ.2.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గాలోడు రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటిదాకా రూ.2.25 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.75 లక్షల షేర్ దూరంలో ఉంది. చూస్తుంటే సుధీర్ ఫ్లాప్ టాక్ తో హిట్ కొట్టేలా ఉన్నాడు.
![]() |
![]() |