![]() |
![]() |

ఆ తరం గొప్ప నటుల్లో కాంతారావు ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సేవలందించిన ఆయన 400 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 2009లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అప్పట్లో ఆయన ఎంతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోగా, ఇప్పుడు ఆయన కుటుంబం మాత్రం సాధారణ జీవితం గడుపుతోంది.
నవంబర్ 16న కాంతారావు జయంతి. ఆయన శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంతారావు కుమారుడు రాజా మీడియాతో మాట్లాడుతూ ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నాన్నగారిని గుర్తుపెట్టుకొని శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని రాజా అన్నారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న వార్తలు నిజమేనని, అయితే మరీ తిండి లేని స్థితిలో లేమని చెప్పారు. సినిమాలు నిర్మించి నాన్నగారు చాలా నష్టపోయారు, ఆ తర్వాత ఆయన క్యాన్సర్ చికిత్స కోసం కూడా చాలా ఖర్చయిందని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి ఎందరో ఆదుకుంటామని చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి సాయం అందలేదని, మేము కూడా ఎవరిని చేయి చాచి అడగలేదని చెప్పారు. అయితే మాకొక ఇల్లు కేటాయించాలని మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ప్రస్తుతం నగర శివారులో అద్దె ఇంట్లో ఉంటున్నామని రాజా చెప్పుకొచ్చారు.
![]() |
![]() |