![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలయ్యాక హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉందంటూ ఎందరో ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవల జపాన్ లో విడుదలై అక్కడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇలా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారంతా. తాజాగా రాజమౌళి సైతం 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు.
యూఎస్ లోని పలు ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఈ క్రమంలో చికాగోలో జరిగిన వేడుకకు హాజరైన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి(రచయిత విజయేంద్రప్రసాద్)తో ఇప్పటికే సీక్వెల్ గురించి మాట్లాడానని, ప్రాథమిక కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు.
రాజమౌళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబుతో ఒక మూవీ ప్రకటించాడు. అది పూర్తి కావడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. అలాగే ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అంటే ఎన్టీఆర్ డేట్స్ కూడా మరో రెండు-మూడేళ్లు ఖాళీ లేనట్టే. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ప్రస్తుతం శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నాడు. 16వ సినిమాకి దర్శకుడిని వెతికే పనిలో ఉన్నాడు. మహేష్ తో రాజమౌళి సినిమా పూర్తయ్యి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి డేట్స్ అందుబాటులో ఉంటేనే గానీ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ సాధ్యమయ్యే అవకాశం లేదు.
![]() |
![]() |