![]() |
![]() |

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం అనగానే మనందరికీ 'మనం'(2014) గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు 'ప్రతిబింబాలు' అనే మరో సినిమా ఆయన చివరి చిత్రంగా విడుదల కాబోతోంది. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు నోచుకోని ఈ మూవీ.. ఇన్నాళ్లకు విడుదల అవుతుండటం విశేషం.
1980 ప్రాంతంలో విష్ణుప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ పై కె.ఎస్.ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ 'ప్రతిబింబాలు' అనే సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఏఎన్నార్, జయసుధ, తులసి, గుమ్మడి, కాంతారావు వంటి అలనాటి మేటి నటీమణులు నటించిన ఈ చిత్రం 1982 లోనే పూర్తయింది. కానీ, అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా ఒకటి తీశారన్న సంగతే ఈ తరానికి తెలియదు. అలాంటిది ఏకంగా 40 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
'ప్రతిబింబాలు' చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా 250 థియేటర్స్ లో విడుదల కానుంది. సినిమా పాతదే అయినా సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నామని, నేటితరం ప్రేక్షకులు మెచ్చేలా చిత్రం ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది. అయితే ఈ సినిమా విడుదలవుతున్న విషయం ప్రేక్షకుల్లోకి అంత బలంగా వెళ్ళలేదు. నాగార్జున లేదా నాగ చైతన్య వంటి వారితో ఈవెంట్ నిర్వహిస్తే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఆసక్తి చూపే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |