![]() |
![]() |

చిరంజీవిని యాక్షన్ హీరోగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రవేసిన తొలినాటి సినిమాల్లో 'యమకింకరుడు' (1982) ప్రధానమైంది. 'ఖైదీ' కంటే ఏడాది ముందు వచ్చిన ఈ సినిమాలో చిరు చేసే స్టంట్లు యాక్షన్ ప్రియులను విపరీతంగా అలరించాయి. డూప్ సాయం లేకుండా రిస్కీ ఫైట్లలో స్వయంగా నటించి ఆ సినిమా టీమ్‌ను కూడా ఆయన అబ్బురపరిచాడు. అప్పట్లో హాలీవుడ్‌లో ఆస్ట్రేలియన్ యాక్టర్ మెల్ గిబ్సన్ నటించిన 'మ్యాడ్ మ్యాక్స్' సినిమా ఓ సంచలనం. అందులో విలన్లు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తెరమీద చూసి ఒళ్లు జలదరించిపోయేది. ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని అల్లు అరవింద్ స్వయంగా ఈ కథను రాశారు. డైరెక్టర్ రాజ్ భరత్ 'యమకింకరుడు' సినిమా రూపొందించారు. గీతా క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరు జోడీగా రాధిక నటించారు.
ఈ సినిమాలో మోటార్ బైక్ చేజ్ సీన్లు, వాటిపై నుంచి చిరు చేసే ఫైట్లను జనం కుర్చీల్లో మునివేళ్లపై కూర్చొని తిలకించారు. జాకాల్ క్యారెక్టర్‌లో సుదర్శన్ ప్రదర్శించిన భయంకరమైన విలనీని ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. కథ ప్రకారం విజయ్ (చిరంజీవి), కిశోర్ (శరత్‌బాబు) పోలీస్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే కాదు బాల్య స్నేహితులు కూడా. విజయ్, కిశోర్ చెల్లెలు రాధ (రాధిక) ప్రేమించుకొని, పెళ్లాడతారు. వారికో బాబు పుడతాడు. విజయ్, కిశోర్ కారణంగా జైలుకు వెళ్లిన జాకాల్ (సుదర్శన్) వాళ్లపై పగబడతాడు. జైలు నుంచి తప్పించుకొని వచ్చి, కిశోర్‌ను కిరాతకంగా చంపేస్తాడు. కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తుంటాడు. జాకాల్‌ను, అతడి గ్యాంగ్‌ను విజయ్ ఎలా అంతం చేశాడనేది క్లైమాక్స్.
చక్రవర్తి స్వరాలు కూర్చగా సిల్క్ స్మితపై చిత్రీకరించిన "ఒయ్‌మా ఒయ్‌మా వయ్యారం" ఐటమ్ సాంగ్ రసికులను ఉర్రూతలూగించింది. జగ్గయ్య, సత్యనారాయణ, సాహుల్, టెలిఫోన్ సత్యానారాయణ, ధమ్, జయమాలిని, ఈశ్వరి ఇతర పాత్రధారులు. బాబూరావు మాటలు, ఆరుద్ర, వేటూరి పాటలు రాశారు. ఈ మూవీలోని స్టంట్స్‌ను రాజు మాస్టర్ డిజైన్ చేశారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1982 అక్టోబర్ 22న 'యమకింకరుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
![]() |
![]() |