Home  »  News  »  పవన్-పూరిల వివాదాస్పద చిత్రం 'రాంబాబు'కి పదేళ్ళు!

Updated : Oct 18, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'బద్రి'(2000) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి జగన్నాథ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక్క సినిమాతోనే పవన్-పూరి కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూశారు. పూరి సైతం తను రాసే మెజారిటీ స్క్రిప్ట్ లు పవన్ ని దృష్టిలో పెట్టుకునే రాసేవాడు. కానీ వీరి కాంబోలో రెండో సినిమా రావడానికి ఏకంగా 12 ఏళ్ళు పట్టింది.

పవన్-పూరి కలయికలో వచ్చిన రెండో సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. 2012 అక్టోబర్ 18న విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జర్నలిస్ట్ రాంబాబు పాత్రలో పవన్ చెలరేగిపోయాడు. పూరి మాటలు పవన్ నోటి వెంట తూటాల్లా పేలాయి. అయితే తెలంగాణ ఉద్యమ సెగ తారాస్థాయికి చేరిన సమయంలో విడుదలైన ఈ చిత్రం పలు వివాదాలకు దారితీసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు నాయకులను పరోక్షంగా టార్గెట్ చేస్తూ పెట్టిన డైలాగ్స్ నిరసనలకు కారణమయ్యాయి. పలు చోట్ల సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇక అత్యుత్సాహం చూపించే కొన్ని న్యూస్ చానెల్స్ గురించి కూడా ఇందులో చెప్పిన కొన్ని డైలాగ్స్ సంచలనమయ్యాయి. విడుదల సమయంలో వివాదాల కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు కానీ, ఇప్పటికీ ఈ చిత్రం ఎందరికో ఫేవరెట్ గా ఉంది. ఈ చిత్రం విడుదలై నేటితో పదేళ్ళు పూర్తయింది.

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కి జోడీగా 'గంగ' పాత్రలో తమన్నా నటించగా.. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, ఆలీ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'జెరమొచ్చింది', 'ఏ మెలికల్', 'ఎక్స్ ట్రార్డినరీ' వంటి పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలకు భాస్కరభట్ల సాహిత్యం అందించడం విశేషం. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా శ్యాం కె. నాయుడు, ఎడిటర్ గా ఎస్.ఆర్. శేఖర్ వ్యవహరించారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.