![]() |
![]() |

మంచు మోహన్ బాబు వారసుడిగా 'విష్ణు'(2003) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన మంచు విష్ణు ఇప్పటిదాకా 20 పైగా సినిమాల్లో నటించాడు. కానీ అతని ఖాతాలో సరైన విజయాలు ఐదు కూడా లేవు. 2007లో వచ్చిన 'ఢీ'నే విష్ణు కెరీర్ లో బిగ్ హిట్. ఆ తర్వాత 'దేనికైనా రెడీ'(2012), 'దూసుకెళ్తా'(2013), 'ఈడో రకం ఆడో రకం'(2016) వంటి సినిమాలతో అడపాదడపా ఆకట్టుకున్నప్పటికీ 'ఢీ' స్థాయి విజయం మాత్రం వరించలేదు. ఓ వైపు తనతో పాటు వచ్చిన ఇతర వారసులు స్టార్లుగా మారారు, మరోవైపు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కొత్త కొత్త హీరోలు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో విష్ణు కెరీర్ కి 'జిన్నా' సినిమా కీలకంగా మారింది.
విష్ణు నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం 'జిన్నా'. సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 21న విడుదలవుతున్న ఈ సినిమాపై విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ తో పాటు బడా టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపాడు. ఇందులో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. సునీల్, వెన్నెల కిషోర్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ జి.నాగేశ్వర రెడ్డి, స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలకు ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.
ఈ చిత్రం తన కెరీర్ లో మరో 'ఢీ' అవుతుందని విష్ణు నమ్ముతున్నాడు. 'ఢీ' చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం.. అలాగే విష్ణుకి 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి విజయాలను అందించిన జి.నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ అందించడం వంటివి ఆసక్తికరంగా మారాయి. ఆరేళ్లుగా విజయం రుచి చూడని విష్ణు 'జిన్నా'తోనైనా గాడిలో పడతాడేమో చూడాలి.
![]() |
![]() |