![]() |
![]() |

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'కాంతార' గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత హోంబళే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కర్నాటకలో ఒక సాధారణ చిత్రంగా విడుదలై, అసాధారణ విజయాన్ని సాధించింది. అడవి నేపథ్యంలో గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన కథతో తయారైన ఈయాక్షన్ థ్రిల్లర్‌ను చూసి ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతున్నారు. ఈ రోజు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా మన ముందుకు వచ్చింది.
కాగా, ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా 'కాంతార' రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ 2' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌ను అది దాటేసింది. 'ఆర్ఆర్ఆర్'కు ఐఎండీబీలో 8 రేటింగ్, 'కేజీఎఫ్ 2' 8.4 రేటింగ్‌తో ఉండగా, 'కాంతార'కు ఏకంగా 9.5 రేటింగ్ దక్కింది. అసాధారణమైన సినిమా కాబట్టే ఇలాంటి అసాధారణమైన రేటింగ్ దక్కిందని కన్నడ సినీ ప్రియులు సంబరపడుతున్నారు.
రిషబ్ శెట్టి స్వయంగా కథా కథనాలు సమకూర్చిన 'కాంతార' అడవికీ, మనిషికీ మధ్య జరిగే సంఘర్షణ వల్ల తలెత్తే పరిణామాలను చూపించింది. భూమితో, అడవితో, దైవంతో గిరిపుత్రులకు ఉండే అనుబంధాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. కిశోర్, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, విక్రమ్ మోరే స్టంట్ కొరియోగ్రఫీ బిగ్ ఎస్సెట్‌గా నిలిచాయి.
![]() |
![]() |