![]() |
![]() |

పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, సినిమాల్లో కనిపించే కమెడియన్ బండ్ల గణేష్. నిర్మాతగానూ కొన్ని భారీ సినిమాలు తీసి, విజయాలు సాధించారు. వాటిలో గబ్బర్‌సింగ్ కూడా ఉంది. మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడతాడు ఈయన. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అవుతూ ఉంటాయి. ఆయన టైటిల్ రోల్ చేసిన "డేగల బాబ్జి" మూవీ ఈరోజు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. ఇందులో గణేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. "నేను ఇప్పటివరకు చేసిన మూవీస్ లో ఏ రోల్ కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి ఆర్టిస్ట్ అనుకున్నా అంతే. నేను బిజినెస్‌మేన్‌ని. ఆర్టిస్ట్ ని అని ఎప్పుడూ అనుకోలేదు. ఐతే ఇన్నేళ్ల నా సినీ చరిత్రలో నేను బాగా చేసాను, నాకు నచ్చిన రోల్ అంటే అది డేగల బాబ్జిలో చేసిందే." అని తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"ఇక ముందు నేను సినిమాలు తీస్తాను కానీ, వాటిలో నేను నటించాలనే ఆలోచన లేదు. సినిమాలు చేస్తే మాత్రం పెద్ద సినిమాలే చేస్తాను కానీ చిన్న సినిమాలు చేయను. ఎందుకంటే సినిమా చేస్తే పగిలిపోవాలి. మన సినిమా రిలీజ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ రోజులా ఉండాలి.. ఆ రోజు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా హాలిడేస్ ఇచ్చేయాలి. అలాంటి సినిమా తీయాలి కానీ ఏదో సినిమా వచ్చిందా పోయిందా అంటే కుదరదు" అని చెప్పారు. "రాబోయే ఎన్నికలలోపు ఒక అద్దిరిపోయే మూవీ మాత్రం తప్పకుండా తీస్తాను. ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నీ నాకిష్టమైనవే. కానీ వాటిల్లో కొన్ని ఆదరణకు నోచుకోలేదు, దానికి మనమేం చేయలేము కదా" అన్నారు బండ్ల గణేష్.
తానెప్పుడైనా, ఎక్కడైనా సరే తనకు అనిపించింది మాట్లాడతాను కానీ, ఎవరో ఏదో అనుకుంటారని ప్రిపేర్ అయ్యి ఏదో మాట్లాడనని అన్నారు. "నేను వివాదాల జోలికే పోను. ఎందుకంటే నాకున్న వ్యాపకాలు, వ్యాపారాలు చాలు.. వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే అందరూ అనుకుంటున్నట్టు పూరి జగన్నాథ్ తో నాకు ఎలాంటి వివాదం లేదు. ఫ్యూచర్ లో ఆయనతో కలిసి సినిమా తీస్తానా, తియ్యనా కాదు ప్రపంచంలో జరగకూడనిది అంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. రెండు రాష్ట్రాలు విడిపోతాయని అనుకున్నామా.. కాబట్టి ఇక్కడ ఏదైనా జరగొచ్చు, జరగకపోవచ్చు కూడా.. దాన్నే కాలం అంటారు. నేనెక్కడో గుంటూరులో పుట్టి, కర్ణాటకలో పెరిగి, చివరిగా హైదరాబాద్ లో స్థిరపడతానని ఊహించానా.. లేదు కదా.. అంతా ఆ దైవ నిర్ణయం" అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.
![]() |
![]() |