![]() |
![]() |

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే కంటెంట్‌ను చూడ్డానికి ఎన్నో జీవిత కాలాలు కావాలి. అంత ఎక్కువగా కంటెంట్ ఓటీటీపై వస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. అనేక ఓటీటీ యాప్‌లు.. వాటిలో పదులు, వందలు కాదు.. వేలాది సంఖ్యలో మూవీస్, సీరియల్స్, సిరీస్, డాక్యుమెంటరీస్ అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో నాణ్యమైన కంటెంట్‌ను, మిస్ చేయకూడని కంటెంట్‌ను వెతికి పట్టుకోవడం వీక్షకులకు పెద్ద పరీక్షగా మారింది. తెలుగువన్ ద్వారా అలాంటి క్వాలిటీ కంటెంట్ గురించిన సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తున్నాం.
ఓటీటీ వేదికపై నెట్‌ఫ్లిక్స్ ఓ దిగ్గజంగా పేరు పొందింది. క్వాలిటీ విషయంలో మిగతా ఓటీటీ సంస్థలతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ముందుందనేది ఎక్కువమంది అంగీకరించే విషయం. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సిరీస్‌కు మంచి విలువతో పాటు ఆదరణ కూడా ఉంటోంది. అలాంటి సిరీస్‌లో 'రోమన్ ఎంపైర్' డాక్యూ డ్రామా ఒకటి. రోమన్ మహాసామ్రాజ్యం గురించి మనం క్లాస్ బుక్స్‌లో చదువుకొని ఉన్నాం. అలాగే రోమన్ వీరులపై అప్పుడప్పుడు వచ్చిన కొన్ని సినిమాలను కూడా చూశాం. అదే.. రోమ్ నగరాన్ని పాలించిన రాజులు, చక్రవర్తులు, ఆనాటి వీరులు, రోమ్‌ను గుప్పెట్లో పెట్టుకోడానికి కొంతమంది పన్నే పన్నాగాలు, వెన్నుపోట్లు, హత్యలు, హత్యాకాండలు, యుద్ధాలు, అవాంఛనీయ సెక్స్ సంబంధాలు, ఒళ్లు జలదరింపజేసే గ్లాడియేటర్ పోటీలు.. వంటి వాటన్నింటినీ సిరీస్‌గా చూసే అవకాశం వస్తే.. అస్సలు వదులుకోలేం.
అందుకే 'రోమన్ ఎంపైర్' సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడూ హాట్ సిరీస్‌గానే ఉంటోంది. మధ్యమధ్యలో పరిశోధకుల విశ్లేషణలతో కూడిన హిస్టారికల్ డాక్యూ డ్రామాగా, ఒక అంథాలజీ ఫార్మట్‌లో వచ్చిన 'రోమన్ ఎంపైర్'.. మూడు సీజన్లు అందుబాటులో ఉన్నాయి. 6 ఎపిసోడ్ల ఫస్ట్ సీజన్ 'రైన్ ఆఫ్ బ్లడ్'లో శారీరకంగా అంత శక్తిమంతుడు, వీరుడు కానప్పటికీ, తన తెలివితేటలతో, కన్నింగ్ నేచర్‌తో కామొడస్ ఎలా చక్రవర్తి స్థాయికి ఎదిగాడనే అంశం ప్రధానంగా కనిపిస్తుంది. కామొడస్‌గా ఆస్ట్రేలియన్ యాక్టర్ ఆరోన్ జకుబెంకో నటించాడు. జెర్మియా మర్ఫీ, పీటర్ షెర్మన్ సంయుక్తంగా రచన చేసిన ఈ సీజన్‌ను రిచర్డ్ లోపెజ్ డైరెక్ట్ చేశాడు.
ఐదు ఎపిసోడ్ల రెండో సీజన్ 'మాస్టర్ ఆఫ్ రోమ్'లో ఒక సాధారణ సైనికుడి నుంచి డిక్టేటర్‌గా జూలియస్ సీజర్ ఎలా ఎదిగాడనేది ప్రధానాంశం. అలాగే రిపబ్లిక్‌గా రోమ్ ఎలా కూలిపోయిందో కూడా ఈ సీజన్‌లో మనం చూస్తాం. సీజర్ రోల్‌ను ఆస్ట్రేలియన్ యాక్టర్ డిచ్ డావీ పోషించాడు. క్లియోపాత్ర క్యారెక్టర్ కూడా ఈ సీజన్‌లోనే వస్తుంది. ఇక నాలుగు ఎపిసోడ్ల మూడో సీజన్ 'ద మ్యాడ్ ఎంపరర్'లో కలిగ్యులా కథను చూడొచ్చు. రోమన్ హిస్టరీలోనే అత్యంత నీచుడైన చక్రవర్తిగా కలిగ్యులా ఇన్‌ఫేమస్ అయ్యాడు. సొంత అక్కచెల్లెళ్లతోనే శారీరక సంబంధాలు పెట్టుకున్నవాడిగా అతను మనకు కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్‌ను సౌతాఫ్రికాలో పుట్టి, ఆక్లాండ్‌లో స్థిరపడిన ఇడో డ్రెంట్ చేశాడు. 2016-19 మధ్య కాలంలో ఈ మూడు సీజన్లు ఎయిర్ అయ్యాయి. ఇంతదాకా ఈ సిరీస్‌ను చూడకపోతే.. వెంటనే మీ వాచ్‌లిస్ట్‌లో 'రోమన్ ఎంపైర్'ను చేర్చేయండి.
![]() |
![]() |