![]() |
![]() |

ఎర్ర సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు మాదాల రంగారావు. ఆయన నటించిన 'యువతరం కదిలింది', 'ఎర్రమల్లెలు', 'స్వరాజ్యం', 'విప్లవశంఖం' సినిమాలు బ్రహ్మాండంగా ఆడటమే కాకుండా, ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని, సంచలనాన్ని రగిలించాయి. నవతరం పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి, దానిపై తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణమైన సినిమాలు తీసి, ఎంతో కీర్తిని ఆయన సంపాదించుకున్నారు. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, జనం మనం, ఎర్రమట్టి లాంటివి ఆ బ్యానర్ మీద వచ్చినవే. 2018లో ఆయన కన్నుమూశారు.
ఆయన కుమారుడు మాదాల రవి కూడా నటునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, సొంతంగా 'నేను సైతం' (2004) అనే సినిమాని నిర్మించారు. అందులో ఆయన హీరోగా నటించగా, రంగారావు ఓ శక్తిమంతమైన పాత్ర చేశారు. అయితే ఈ సినిమాను తండ్రి నెలకొల్పిన నవతరం పిక్చర్స్ బ్యానర్ మీద కాకుండా భారత్ ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ మీద తీశారు రవి. నవతరం పిక్చర్స్ బ్యానర్ అంటే ప్రజల్లో ఎంతో విలువ ఉన్నదనీ, ఆ విలువను అలాగే ఉంచాలనే ఉద్దేశంతోటే భారత్ ప్రొడక్షన్స్‌ను నెలకొల్పి, దానిపై సినిమా తీశాననీ ఆయన చెప్పారు.
అయితే ఇన్నాళ్ల తర్వాత నవతరం పిక్చర్స్ మీద ఓ సినిమా రాబోతోంది. ఆ బ్యానర్‌పై సినిమా తియ్యాలని మాదాల రవి సంకల్పించారు. 2022లోనే ఈ సినిమా మొదలవుతుందని తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. "నవతరం పిక్చర్స్ నుంచి ఈ ఏడాది ఓ సినిమా మొదలవుతుంది. పరుచూరి గోపాలకృష్ణ గారు స్క్రిప్టు రాస్తున్నారు. డైరెక్టర్ ఎవరనేది తర్వాత చెప్తాను. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది." అని ఆయన చెప్పారు.
నిజానికి తండ్రి రంగారావు సినిమా 'ఎర్రమల్లెలు' ద్వారా బాలనటునిగా తెరంగేట్రం చేశారు రవి. ఆ మూవీలో "నాంపల్లి టేషను కాడి రాజాలింగో" పాటను ఆయన మీదే చిత్రీకరించారు. చివరగా ఆయన 'పంచముఖి' (2015)లో నటించారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
![]() |
![]() |