Home

»

Latest News

సందీప్ కిష‌న్‌, వెంకీ అట్లూరి, చైత‌న్య కృష్ణ 'స్నేహ‌గీతం'కు పుష్క‌రం నిండింది!

Jul 16, 2022 11:03AM

 

ఇప్పుడు డైరెక్ట‌ర్‌గా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన వెంకీ అట్లూరి హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం 'స్నేహ‌గీతం'. సందీప్ కిష‌న్‌, చైత‌న్య‌కృష్ణ కూడా హీరోలుగా న‌టించిన ఈ సినిమాకు మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు కాగా, శ్రీ‌ధ‌ర్ ల‌గ‌డ‌పాటి నిర్మాత‌. వెంకీ అట్లూరి ఈ మూవీకి డైలాగ్స్ కూడా రాశాడు. హైద‌రాబాద్‌లోని న‌ల్ల మ‌ల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌లో ఫ్రెండ్స్ అయిన ఐదుగురు స్నేహితుల క‌థ ఇది. వారిలో ముగ్గురు హీరోలు కాగా, ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. 

వెంకీ స‌ర‌స‌న శ్రేయా ధ‌న్వంత‌రి, చైత‌న్య‌కృష్ణ జోడీగా రియా న‌టించిన ఈ మూవీలో సందీప్ స‌ర‌స‌న సుహాని క‌లిత నాయిక‌గా న‌టించింది. కాలేజీ ఫ్రెండ్‌షిప్ అండ్ ల‌వ్ స్టోరీ కావ‌డంతో అప్ప‌ట్లో యూత్‌ను బాగానే ఎట్రాక్ట్ చేసింది ఈ మూవీ. ఇందులో హీరోలు, హీరోయిన్ల‌వి భిన్న అభిరుచులు కావ‌డం, వారి ఆశ‌యాల‌కు ఏర్ప‌డిన ఆటంకాలు చివ‌ర‌కు తొల‌గిపోయి సుఖాంతం కావ‌డం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రూ చ‌క్క‌ని ప‌ర్ఫార్మెన్స్ చూపిన ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మ‌ధుర శ్రీ‌ధ‌ర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. సిరాశ్రీ రాసిన 'ఒక స్నేహ‌మే', 'ఎంతో ఎంతెంతో', 'వెలిగే వెన్నెలే' పాటలు, చిన్నిచ‌ర‌ణ్ రాసిన 'గ‌ల గ‌లా', 'స‌రిగ‌మ‌ప‌ద‌ని' పాట‌లు అల‌రించాయి. 'స‌రిగ‌మ‌ప‌ద‌ని' పాట‌పాడిన ప్ర‌ణ‌వికి ఉత్త‌మ గాయ‌నికిగా నంది అవార్డు ల‌భించింది కూడా. పి.జి. విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ మూవీలో కృష్ణుడు, వెన్నెల కిశోర్‌, శంక‌ర్ మేల్కోటే, వేణుమాధ‌వ్‌, లోహిత్ కీల‌క పాత్ర‌లు చేశారు. లార్‌స్కో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మైన 'స్నేహ‌గీతం' 2010 జూలై 16న విడుద‌లైంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com