![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `గణేష్` ఒకటి. వైద్య వ్యవస్థలోని రాక్షసులను నిమజ్జనం చేసే గణేష్ అనే జర్నలిస్ట్ గా ఇందులో తన అద్భుత అభినయంతో ఆకట్టుకున్నారు వెంకీ. అలాగే, తన నటనకిగానూ `బెస్ట్ యాక్టర్`గా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకున్నారాయన. నూతన దర్శకుడు తిరుపతి స్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు సమర్పణలో డి. సురేశ్ బాబు నిర్మించారు.
ఇందులో వెంకీకి జంటగా రంభ నటించగా మధుబాల, రేవతి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, కీర్తన, జయప్రకాశ్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, అలీ, వేణుమాధవ్, నరసింహరాజు, రమాప్రభ, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి బ్రదర్స్ సమకూర్చిన సంభాషణల్లో.. ``ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్`` అంటూ వెంకటేశ్ పలికే డైలాగ్ బాగా పాపులర్ అయింది.
అలాగే, మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `గణేష్`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``సిరి సిరి మువ్వలు``, ``రాజహంసవో``, ``హిందీలోన చుమ్మా``, ``అయ్యోరామ``, ``ఆదా బర్ సే`` - ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. 1998 జూన్ 19న విడుదలై అఖండ విజయం సాధించిన `గణేష్.. `తృతీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ ప్రతినాయకుడు` (కోట), `ఉత్తమ మాటల రచయిత` (పరుచూరి బ్రదర్స్), `బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్` (రాఘవ) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకుంది. కాగా, నేటితో ఈ చిత్రం 24 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |