![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. కమర్షియల్ గానూ మెప్పించాయి. అలాంటి సినిమాల్లో.. `కొండవీటి దొంగ` ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో ఆకట్టుకున్నారు చిరు. మెగాస్టార్ కి జంటగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, అభినేత్రి రాధ నటించగా శారద, శ్రీవిద్య, రావు గోపాల రావు, మోహన్ బాబు, అమ్రిష్ పురి, సత్యనారాయణ, నాగేంద్ర బాబు, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, రంగనాథ్, నిర్మలమ్మ, కళ్ళు చిదంబరం, చలపతి రావు, దివ్యవాణి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
ఇళయరాజా బాణీలకు దిగ్గజ గీతరచయితలు వేటూరి సుందర రామ్మూర్తి, `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. పాటల్లో ``శుభలేఖ రాసుకున్నా`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``ఛమకు ఛమకు``, ``జీవితమే ఒక ఆట``, ``కోలో కోలమ్మ``, ``టిప్ టాప్``, ``శ్రీ ఆంజనేయం``, ``దేవి శాంభవి`` కూడా విశేషాదరణ పొందాయి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన `కొండవీటి దొంగ`కి.. పరుచూరి బ్రదర్స్ కథ, సంభాషణలు అందించగా యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. 1990 మార్చి 9న విడుదలై ఘనవిజయం సాధించిన `కొండవీటి దొంగ`.. నేటితో 32 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |