![]() |
![]() |

దర్శకుడిగా మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తన మంచి మనస్సుతోనూ ఎందరో హృదయాలను గెలుచుకుంటున్నాడు. కళ్ళ ముందే సొంతింటి కల కాలి బూడిదై పుట్టెడు బాధలో ఉన్న ఓ రైతుకి శేఖర్ కమ్ముల లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేసి అండగా నిలిచాడు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య తనకు ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముకోగా రూ.10 లక్షలు వచ్చాయి. అందులో తనకి ఉన్న అప్పులు తీర్చగా.. ఆరు లక్షలు మిగిలాయి. గుడిసెలో నివాసం ఉండే లక్ష్మయ్య.. ఇల్లు కట్టుకోవాలని భావించి.. ఆ రూ.6 లక్షలను ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాడు. ఇల్లు కట్టుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ అయ్యి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూరిల్లు కావంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ మంటల్లో బీరువాలో దాచుకున్న డబ్బు కూడా కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న లక్ష్యయ్య.. ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న డబ్బు మంటల్లో తగలబడి పోతుంటే నిస్సాహాయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ ఘటనపై ఓ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాన్ని చూసి శేఖర్ కమ్ముల చలించిపోయాడు. తన వంతుగా లక్ష రూపాయలను లక్ష్మయ్యకు అందించాడు . అంతేకాదు, భవిష్యత్ లోనూ లక్ష్మయ్య కుటుంబానికి అండగా ఉంటానని శేఖర్ కమ్ముల భరోసా ఇచ్చాడు.
![]() |
![]() |