Home  »  News  »  క‌మ్ములా.. నీకు హార్టుంద‌బ్బా!

Updated : Oct 1, 2021

నేను డిగ్రీలో ఉన్య‌ప్పుడు 'రూప‌'ను చూశా.. పొంగిపోయా! ( ఆనంద్‌).
డిగ్రీ అయిపోయి హైద‌రాబాద్‌కి వ‌చ్చినాక 'సీత‌'ను చూసినా.. సూప‌ర్బు!(గోదావ‌రి).
ఈభూమి వార ప‌త్రిక‌లో ప‌నిచేసేప్పుడు 'మ‌ధు'ద‌యం.. మహోద‌యం!(హ్యాపీడేస్‌)
పూర్తి జ‌ర్న‌లిస్టు అయ్యాక బాన్సువాడ భానుమ‌తి.. అదే హైబ్రిడ్ పిల్ల‌ను చూసి.. ఫిదా అయిపోయి చేత్తాడంత రివ్యూ రాశా (ఫిదా).
నిన్న‌నే మౌనిక‌ను చూశాక మాట‌లు రాలేదు..(ల‌వ్ స్టోరీ)
ఏంది సోమీ నువ్వు..
తెలంగాణ ప‌దాలంటే న‌వ్విన‌చోట నాప‌చేను పండిచ్చానావు. తంబీ.., గ‌ట్ల‌నా అంటూ కామెడీ విల‌నిజానికే ప‌రిమితం చేసిన తెలుగు ద‌ర్శ‌కుల‌కు తెలంగాణ మాండ‌లిక సొగ‌సును తినిపిస్తున్నావు. హీరో, హీరోయిన్లు ప‌లికే మాండ‌లిక‌ ప‌దాలు వింటుంటే.. ఈ తీపెక్క‌డిదీ అనిపిచ్చాంది. ఆ పెద్దాయ‌న పింగ‌ళి అంటాడు.. *ఎవ‌రో పుట్టించ‌కుంటే ప‌దాలెట్లా పుడ‌తాయి@ అని. నీలాంటోళ్లు ఉండ‌బ‌ట్టే.. తెలంగాణానుబంధం తెర‌పై తారాస్థాయికి వ‌చ్చింది. నీకెవ‌రు ఎన్ని వీర‌తాళ్లు వేసినా త‌క్కువేన‌బ్బా!
బాపూ సినిమాల్లో అయినా *పెద్ద‌ల‌కే*ట్యాగ్ ఉంటుంది.. నీ సినిమాల్లో ఉండ‌దు.
హీరోయిను అంటే అందాల‌బొమ్మ మాత్ర‌మే అనుకునే ఈ మేల్‌డామినేష‌న్ ప్ర‌పంచంలో..
ఎంత అద్భుత‌మైన ఆడ‌పిల్ల‌ల పాత్ర‌లు పుట్టిస్తావు! 
నువ్వు ఎంత మంచి ద‌ర్శ‌క సృష్టిక‌ర్త‌వ‌బ్బా! 
పూలు, అమ్మాయిలు ఒక్క‌టేనంటారు..
ఆత్మాభిమానంతో ఉంటే త‌ట్టుకోలేరెవ్వ‌రూ!
రూప ద‌గ్గ‌ర‌నుంచి మౌనిక వ‌ర‌కూ.. ఆటిట్యూడ్ ఉండే పాత్ర‌ల‌నే సృష్టించావ‌నే మాట‌లు కొంద‌రు అనొచ్చు గాక‌. అవేమీ ప‌ట్టించుకోన‌క్క‌ర్లేదు. ఎందుకంటే ఆ మాట‌లు.. పురుషాధిక్య ప్ర‌పంచంలోంచి పుట్టిన‌వే క‌దా. 
క‌మ్ముల క‌థానాయిక‌లంటే..
గ‌మ్మున ఉండరు.. అణువ‌ణువునా.. ఆత్మాభిమానం ఉండే నిప్పుర‌వ్వ‌లు.
లాక్ డౌన్‌లో ఉండే స్వ‌చ్చ‌మైన వాతావ‌ర‌ణంలా... 
వాన చినుకుల‌తో క‌డిగేసిన మ‌ట్టిమాదిరి.. ఎట్ల పుట్టిస్తావ‌ప్పా!
ఆడ‌పిల్లల మ‌న‌సు స‌ముద్రంలాంటిదే అంట‌. 
వారిలోని చిలిపిద‌నాల్ని, ఆశ‌ల్నీ, ఆనందాల్ని, బ‌డ‌బాగ్నుల్ని.. 
నీ అంత గొప్ప‌గా తెలుసుకున్య ద‌ర్శ‌కుడు తెలుగులో లేరు. 
ఆడపిల్ల‌ల చైత‌న్య‌కిర‌ణం.. మ‌గువ మ‌న‌సు తెలుసుకునే వీర ప్రేమ‌గాథ‌.. ఈ 'ల‌వ్ స్టోరీ'.
నీ గుండెలో సామాజిక సందేశం ఇవ్వాల‌ని.. నీ మ‌న‌సులో వేద‌న‌ను తెలియ‌చెప్పాల‌ని ఎన్నాళ్ల‌నుంచి ఉందో తెలీదు కానీ..
ఆడ‌పిల్ల‌ల జీవితాల్ని ఇంత అద్భుతంగా.. స్పూన్ ఫీడింగ్ ఇచ్చిన‌ట్లు చ‌ర్చించిన నీ తీరుకు హ్యాట్సాఫ్‌.
ల‌వ్‌స్టోరీలో రెండు ల‌వ్ స్టోరీల‌ను ఇముడ్చి.. అమ్మానాన్న‌ల‌కు.. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఆలోచ‌న రేకెత్తించావు.
ఒక‌ప్పుడు ఇంట్లో ఆడ‌పిల్ల‌లు బాధ‌ప‌డితే.. అవ్వ‌, జేజి, మేన‌త్త‌, పెద్ద‌మ్మ, చిన్న‌మ్మ‌నో చూసేటోళ్లు. ఆళ్ల‌కే చెప్పేవాళ్లు.
ఇపుడీ న్యూక్లియ‌ర్ కుటుంబాల్లో... అమ్మాయిల మ‌న‌సును తెలుసుకోండి.. వారి గురించి ఆరా తీయండ‌ని.. ఓ సైకాలజిస్టుగా.. అమ్మ‌మ్మంత ఓపిక‌తో చెప్పినావు.
ఈ తీరే భ‌లే న‌చ్చింద‌బ్బా!
ఆడ‌పిల్ల‌లకు ఆత్మ‌విశ్వాస‌మిచ్చే గొప్ప టానిక్‌.. 'ల‌వ్ స్టోరీ'
పిల్ల‌ల‌ను వ‌దిలేసే అమ్మానాన్న‌ల‌కు చెంప‌దెబ్బ 'ల‌వ్‌స్టోరీ'
ఆడ‌పిల్ల‌ల‌ని హీనంగా చూసే పోకిరీల‌కు చెప్పుదెబ్బ 'ల‌వ్‌స్టోరీ'.
ఈ త‌రానికి గొప్ప గురువు నువ్వు..
నీలాంటి వాళ్లుండ‌బ‌ట్టే తెలుగు సినిమాల‌కు కొద్దో గొప్పో మంచి పేరుంద‌బ్బా!
ఈ దేశంలో కులాలు, మ‌తాలు.. క‌ల‌వ‌ని రేఖ‌లే.
రాముడు, అల్లా, క్రీస్తులు.. ప్ర‌వ‌క్త‌లు క‌లిసొచ్చినా అంత‌రాలే ఉంటాయి.
ఈ టాపిక్‌ను ప‌క్క‌న‌బెడితే..
అమ్మాకొడుకు ఉండే పేదోళ్ల క‌థ‌..
ధ‌నికులైనా పేద‌వాళ్ల‌యినా ఓ చిన్న‌కుటుంబం క‌థ‌తో ఎంత అద్భుతంగా ప‌ల్లె జీవితాల‌ను.. ప్ర‌స్తుత స‌మాజం తీరును చెప్పినావో! 
రేవంత్‌, మౌనిక పాత్ర‌లేసుకున్న డ్ర‌స్సుల గురించి చ‌ర్చించ‌ను కానీ..\ వాళ్ల అంద‌మైన మ‌న‌సుని మాత్రం పొగ‌డ‌కుండా ఉండ‌లేను.
పేదింటి పిల్లోడిగా నాగ‌చైత‌న్య ఇట్లా న‌టించ‌డం అంటే 'తెలుగు హీరో' మారాడ‌ని చెప్పొచ్చు.
కాదు కాదు.. నువ్వే మార్చేశావు. కథాబ‌లం ఉంటే ఇట్ల‌నే ఉంటాది. 
సారంగ‌ద‌రియా పాట ఉండాద‌ని మ‌ర్చిపోయి.. సినిమాను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేశారంటే.. నిజ‌జీవితం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు అనిపించింది.
రెండు విభిన్న‌మైన నేప‌థ్యాల‌నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు మంచాల్ని మ‌న గుండెల‌కు క‌నెక్ట్ చేసిన ప్ర‌తిభ‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఇద్ద‌రు ఆత్మాభిమానం ఉండే వ్య‌క్తుల మ‌ధ్య చిగురించి ప్రేమ తీపిని చూపించావు.
రేవంత్ పాత్ర‌లోకి నాగ‌చైత‌న్య‌, మౌనిక పాత్ర‌లోకి సాయిప‌ల్ల‌వి చానా దూరం జ‌ర్నీ చేసినారు. 
అందుకే ఇంత మంచి సినిమా వ‌చ్చింది. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న అన‌టం కంటే జీవించింది అని చెప్పాలి. ఒక క‌థానాయిక‌కు ఇన్ని వేరియేష‌న్లా... ఇలా చేయ‌డం ఎంతో క‌ష్టం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థానాయిక‌ల్ని క‌రివేపాకుల్లా వాడే ఈ రోజుల్లో.. శేఖ‌ర్ సారూ.. మౌనిక రూపంలో ల‌వ్‌స్టోరీ చెట్టుకి అమ్మ‌వేరునే ఇచ్చావే!
అమ్మంటే గుర్తొచ్చింది.. 
అర ఎక‌రం అమ్మ‌న‌ని తిట్టే ఆ అమ్మ‌.. అమ్మినంక కొడుకు బాగుండాడ‌ని పొంగిపోయే ఆ అమ్మ పాత్ర‌కి వంద‌నాలు.
పొలం అమ్ముతాన‌ని రేవంత్ అంటే.. బైక్ పైనుంచి వాళ్లమ్మ దిగ‌టం.. సాయి ప‌ల్ల‌వికి చెప్పులు ఇచ్చే సీన్‌.. గంగ‌వ్వ శాప‌నార్థాల.. బ‌ల్లిగాడు.. రేవంత్ వెన‌కాల ఉండే న‌టుడు.. మౌనిక ఫ్రెండు, మౌనిక అమ్మ‌-నాన్న‌, రాజీవ్ క‌న‌కాల‌, ఉత్తేజ్‌, ఇంకో ప్రేమ జంట‌తో పాటు జుంబా హౌస్‌, చెక్క‌, వాన, చార్మినార్ మ‌ట్టిగాజులు.. గుట్ట‌కాడ గ‌డ్డి(పాట‌లో).. హైద‌రాబాద్ బ‌స్సు.. ప‌ద్మాన‌గ‌ర్ పార్కు.. పాంప్లెట్లు.. పాటలు, మాటలు, సంగీతం..ఏమీ మ‌ర్చిపోలేం. 
శేఖ‌ర్ క‌మ్ముల సినిమా చూడ‌టం అంటే.. 
గుండెల్లోతుల్లోకి వెళ్ల‌టం...
మ‌న‌ల్ని మ‌న‌కు ప‌రిచ‌యం చేయ‌డం..
జ్ఞాప‌కాల‌ను త‌డుముకోవ‌డం.
'ల‌వ్ స్టోరీ' చూస్తున్నంత సేపు మ‌న జీవితంలానే ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య‌నే తిల్లాడ‌తాం. వేగంగా ప‌రిగెత్త‌దు. అన‌వ‌స‌ర‌మైన ఎడిటింగుల్లేవు. సినిమా కూల్‌గా ఉంటుంది.
ఇంత రాసినా.. 
ఇదంతా కేవ‌లం ఐదు ప‌ర్సెంటే... మిగ‌తా 95 ప‌ర్సెంట్ కోసం సినిమా చూడ‌ల్ల మీరు.
ఎంత మంచిగా తీసినావప్పా..
గుండెల్ని పిండేసే.. గొప్ప ప్రేమ కావ్యం 'ల‌వ్‌స్టోరీ'.
ఈ సినిమా న‌చ్చ‌కుంటే.. మీకు హార్టు లేద‌బ్బా!
శేఖ‌ర్ క‌మ్ముల సారూ.. మీకు హార్టు ఉంద‌బ్బా!

(సినిమా టికెట్టు కొని... రెండు గంట‌లు వెయిట్ చేసి.. ఇలాంటి మంచి చిత్రం చూడ‌టం ద‌ర్శ‌కుడికి ఇచ్చే ఓ గౌర‌వం. సినిమ ప‌ట్ల ప్ర‌క‌టించే గొప్ప ప్రేమ అని న‌మ్ముతాన్నేను. అస‌లు సినిమాల‌పై నా వ్యూలు రాయ‌కూడ‌ద‌ని కంక‌ణం క‌ట్టుకున్యా. కానీ క‌మ్ముల సారు సినిమా చూసి రాయాల‌నిపించింది. 
నాకూ హార్టుంద‌బ్బా )

- రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.