![]() |
![]() |

'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో జగన్ సర్కార్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు, మంత్రులు పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసిన సినీ నిర్మాతలు.. ఆన్ లైన్లో టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరామని అన్నారు.
సినీ పరిశ్రమలోని పలు సమస్యలపై మంత్రి పేర్ని నానితో దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతల బృందం చర్చించింది. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ విధానం కావాలని, సినిమా టికెట్ల రేట్లు పెంచమని పరిశ్రమ తరపున ప్రభుత్వాన్ని తామే కోరామని చెప్పారు. అయితే గత చర్చల సారాంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని.. అందువల్లే ప్రస్తుత పరిణామాలు నెలకొన్నాయని అన్నారు. సినీ పరిశ్రమ అనేది చాలా సున్నితమైనదని.. సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.
ఇక మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని.. పరిశ్రమ అంతా ఐకమత్యంతోనే ఉందని పేర్కొన్నారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని.. అలాగే థియేటర్‌లో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాల్సిందిగా నిర్మాతలు కోరినట్లు మంత్రి చెప్పారు. వారి విజ్ఞప్తులపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీ నటుడి వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని వివరించారు. పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు చెప్పారని.. అలాగే చిరంజీవి కూడా తనతో మాట్లాడరని, ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లు మంత్రి తెలిపారు.
![]() |
![]() |