![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎవరు ఏ పదవికైనా పోటీ చేయవచ్చనీ, కాదనీ ప్రెసిడెంట్ లాంటి అత్యున్నత పదవిలో తెలుగువారు ఉండాలనేది తన అభిప్రాయమనీ నరేశ్ చెప్పారు. అక్టోబర్ 10న మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానల్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు నరేశ్. ఇందులో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ లాంటి కీలక పదవులకు ఒకే ప్యానల్ నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటేనే వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారనీ, లేదంటే గొడవలు తప్పవనీ ఆయన హెచ్చరించారు.
ఇటీవల ఓ న్యూస్ చానల్‌లో మాట్లాడుతూ విష్ణు ప్యానల్‌ను నరేశ్ సపోర్ట్ చేస్తున్నందున తాను ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోకి వచ్చినట్లు జీవిత చెప్పడం తనను చాలా బాధించిందని ఆయన అన్నారు. జీవితను తాను చెల్లెలిగా భావిస్తాననీ, రాజశేఖర్ తనకు మంచి ఫ్రెండ్ అనీ నరేశ్ అన్నారు. తప్పు ఆమెది కాదనీ, తాను ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పుడు జనరల్ సెక్రటరీగా జీవితను తీసుకోవడం తన తప్పంటూ కీలక వ్యాఖ్య చేశారు.
గమనించాల్సిన విషయమేమంటే రెండేళ్ల క్రితమే అధ్యక్షుడు నరేశ్ అంగీకారం లేకుండా, ప్రధాన కార్యదర్శి హోదాలో జీవిత 'మా' సమావేశం నిర్వహించడం వివాదం సృష్టించింది. 'మా' బాధ్యతలు చేపట్టాక ఏదో ఒక మంచి పనిచేసి చూపించాలని జీవిత, రాజశేఖర్ భావిస్తూ వచ్చారు. అయితే తనకున్న బిజీ షెడ్యూల్ వల్లనో, మరో కారణం చేతనో 'మా'కు నరేశ్ ఎక్కువ సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు కొంతమంది సభ్యుల నుంచి వినిపించాయి. 'మా' మూలనిధిని పెంచకుండా, ఉన్నదాన్నే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈ విషయాల గురించి గతంలో తోటి సభ్యులతో జీవిత, రాజశేఖర్ చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దానిపై నరేశ్ కోర్టుకెళ్లడంతో, ఆ నిర్ణయాల్ని అమలు చేయొద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత కాలంలో వారి మధ్య వివాదాలు సద్దుమణిగాయి. ఇప్పుడు నరేశ్.. విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తుంటే, జీవిత.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ తరపున మరోసారి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు.
![]() |
![]() |