![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నేటితరం సూపర్ స్టార్ మహేశ్ బాబు (చైల్డ్ హీరో).. ఇలా ముగ్గురు సూపర్ స్టార్స్ మేలి కలయికలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `కొడుకు దిద్దిన కాపురం`. ఇందులో కృష్ణ, విజయశాంతి జంటగా నటించగా వారి కవల పిల్లలుగా మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణ తనే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడమే కాకుండా ఎడిటర్ గానూ వ్యవహరించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు.
చక్రధర్ (మోహన్ బాబు) కారణంగా విడిపోయిన దంపతులు చక్రవర్తి (కృష్ణ), శశిరేఖ (విజయశాంతి)ని.. వారి కవల పిల్లలు ప్రమోద్, వినోద్ (మహేశ్ బాబు) ఎలా కలిపారు? అనేదే `కొడుకు దిద్దిన కాపురం` చిత్ర కథాంశం. తన నట జీవితంలో మహేశ్ తొలిసారిగా డ్యూయెల్ రోల్ చేయడమే కాకుండా.. తన నృత్యాలతో ఘట్టమనేని అభిమానులకు కనువిందు చేశారు. కృష్ణ, విజయశాంతి ఎప్పటిలాగే తమ నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, అశ్విని, సత్యప్రియ, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
రాజ్ - కోటి సంగీతానికి దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``ఓం నమ నటరాజుకే`` విశేషాదరణ పొందింది. 1989 సెప్టెంబర్ 21న విడుదలై అఖండ విజయం సాధించిన `కొడుకు దిద్దిన కాపురం`.. నేటితో 32 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |