![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్రకాష్ రాజ్ కు మద్దతుగా పనిచేసిన బండ్ల గణేష్.. ఇప్పుడు ఆయన ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఏడాది జరగబోయే 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా వరుస ట్వీట్స్ చేశారు.
"గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు.. నన్ను స్పోక్స్ పర్సన్ గా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అయితే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ పదవిని సరిగా నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్." అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేసిన కొద్ది సేపటికే.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను అంటూ ప్రకటన చేస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశారు. "త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు.. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు" అంటూ బండ్ల వరుస ట్వీట్స్ తో సంచలన వ్యాఖ్యలు చేశారు.
![]() |
![]() |