![]() |
![]() |

'ఆట' గేమ్ షోతో యాంకర్‌గా ఓంకార్ స్థిరపడ్డాడు. ఆయన కెరీర్‌కు ఆ షో టర్నింగ్ పాయింట్ అయింది. అందులో ఆయన తమ్ముడు అశ్విన్ కూడా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. గ్రాండ్ ఫినాలేలో అతను గెలిస్తే, ఓంకార్ తమ్ముడు కాబట్టి గెలిచాడనే పేరు వస్తుందనే ఉద్దేశంతో తనంతట తానుగా ఎలిమినేట్ అయ్యాడు అశ్విన్. అలా తన కోసం గెలుపు అవకాశాన్ని త్యాగం చేసిన తమ్ముడికి అతడ్ని ఓ స్థాయిలో నిలబెడతానని ఆరోజే మాటిచ్చాడు ఓంకార్.
ఆ తర్వాత తను మూవీ డైరెక్టర్ అయ్యాక అశ్విన్‌ను హీరోగా పెట్టి 'రాజుగారి గది' (2015) అనే హారర్ మూవీని తీశాడు ఓంకార్. ఆ సినిమా విడుదలకు ముందు ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ, "నాకోసం తమ్ముడు అశ్విన్ రెండుసార్లు తన అవకాశాలను త్యాగం చేశాడు. ఎప్పటికైనా అతడ్ని ఓ స్థాయిలో నిలబెడతానని ఇచ్చిన మాట ప్రకారమే అతను హీరోగా 'రాజుగారి గది'ని రూపొందించాను" అని చెప్పాడు ఓంకార్.
బాక్సాఫీస్ దగ్గర 'రాజుగారి గది' బాగానే ఆడింది. అయితే ఆ సినిమాలో అశ్విన్ కంటే ఓ కీలక పాత్ర చేసిన పూర్ణకే ఎక్కువగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ సిరీస్‌లో మరో రెండు సినిమాలు కూడా తీశాడు ఓంకార్. ఆ రెండింటిలో కూడా అశ్విన్ హీరోగా నటించాడు. కానీ అతడికి ఈ సినిమాలతో ఎలాంటి ఎలివేషన్ రాలేదు. వేరే పేరున్న డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ ఎవరూ కూడా అశ్విన్‌ను హీరోగా పెట్టి సినిమాలు తియ్యలేదు.
ఇప్పటికీ "అశ్విన్ అంటే ఎవరూ?" అని అడిగేవాళ్లే ఎక్కువ. ఆరేళ్లు గడిచాక కూడా నటుడిగా అశ్విన్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. మరి తమ్ముడికి ఇచ్చిన మాటను ఓంకార్ నిజంగా నిలబెట్టుకున్నట్లేనా?
![]() |
![]() |