Home

»

Latest News

ఎన్టీఆర్ `జ‌న‌తా గ్యారేజ్`కి ఐదేళ్ళు!

Sep 1, 2021 12:17PM

క‌థానాయ‌కుడిగా యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ స్థాయిని పెంచిన చిత్రాల్లో `జ‌న‌తా గ్యారేజ్` ఒక‌టి. ` మిర్చి`, `శ్రీ‌మంతుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత కొర‌టాల శివ రూపొందించిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా త‌న‌కి హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో తార‌క్ కి జంట‌గా స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. ఉన్ని ముకుంద‌న్, దేవ‌యాని, స‌చిన్ ఖేద్క‌ర్, అజ‌య్, బ్ర‌హ్మాజీ, రాజీవ్ క‌న‌కాల‌, సురేశ్, సితార‌, విజ‌య్ కుమార్, ర‌హ్మాన్, ఆశిష్ విద్యార్ధి, చ‌ల‌ప‌తి రావు, వెన్నెల కిశోర్ వంటి ప్ర‌ముఖ తారాగ‌ణం కీల‌క పాత్ర‌ల్లో అల‌రించారు.

ఆప‌ద‌ల్లో ఉన్న వారిని ఆదుకోవ‌డం కోసం ఒక సామాన్యుడు డాన్ మాదిరి ఎద‌గ‌డం.. స‌మాంత‌ర ప్ర‌భుత్వంలాంటిది న‌డ‌ప‌డం అనే పాయింట్ తో `జ‌న‌తా గ్యారేజ్`ని తీర్చిదిద్దారు కొర‌టాల శివ‌. పాయింట్ పాత‌దే అయినా, పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న - జ‌న‌రంజ‌క స‌న్నివేశాల స‌మాహారంతో సినిమాని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచి విజ‌యం సాధించారు. ప్రేక్ష‌కుల ఆమోద‌ముద్ర  పొందిన ఈ సినిమా `బెస్ట్ కొరియోగ్ర‌ఫీ` (రాజు సుంద‌రం - ప్ర‌ణామం), `స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్` (మోహ‌న్ లాల్) విభాగాల్లో జాతీయ పుర‌స్కారాల‌ను.. `బెస్ట్ పాపుల‌ర్ ఫీచ‌ర్ ఫిల్మ్`, `బెస్ట్ యాక్ట‌ర్` (ఎన్టీఆర్), `బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్` (మోహ‌న్ లాల్), `బెస్ట్ స్టోరీ రైట‌ర్` (కొరటాల‌), `బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్` (రాజు సుంద‌రం - ప్ర‌ణామం), `బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్` (ఎ.ఎస్. ప్ర‌కాశ్), `బెస్ట్ లిరిసిస్ట్` (రామ‌జోగ‌య్య శాస్త్రి - ప్ర‌ణామం) కేట‌గిరిల్లో `నంది` అవార్డుల‌ను సొంతం చేసుకుంది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రానికి  రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్య‌మందించారు. పాట‌ల్లో ``ప్ర‌ణామం``, ``ప‌క్కా లోక‌ల్`` చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. అలాగే ``ఆపిల్ బ్యూటీ``, ``జ‌య‌హో జ‌న‌తా``, ``రాక్ ఆన్ బ్రో``, ``నీ సెల‌వ‌డిగి`` గీతాలు కూడా ఆక‌ట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన `జ‌న‌తా గ్యారేజ్`.. 2016 సెప్టెంబ‌ర్ 1న విడుద‌లైంది. నేటితో ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 5 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com