![]() |
![]() |

కెరీర్‌లో రెండోసారి హ్యాట్రిక్ హిట్ సాధించిన తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా అంటే, అందరి కళ్లూ దానిపై ఉండటం సహజం. అందుకే ఇప్పుడందరూ 'సర్కారువారి పాట' వైపు చూస్తున్నారు. సెట్స్‌పై వెళ్లడానికి చాలా ముందుగానే టైటిల్ పెట్టేయడం, దానికి అనూహ్యమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆరంభానికి ముందే సినిమా సూపర్‌హిట్ అనే భావన ఇండస్ట్రీలోని వాళ్లలోనే కాకుండా, బయటివాళ్లలోనూ వచ్చేసింది.
ఇప్పటికే మహేశ్ 'భరత్ అనే నేను' (2018), 'మహర్షి' (2019), 'సరిలేరు నీకెవ్వరు' (2020) వరుస హిట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇది ఆయనకు రెండో హ్యాట్రిక్ హిట్. అంతకు ముందు 'దూకుడు' (2011), 'బిజినెస్‌మేన్' (2012), 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (2013) సినిమాలతో ఆయన తొలి హ్యాట్రిక్ హిట్‌ను నమోదు చేశాడు. 'సరిలేరు నీకెవ్వరు' ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.
మరోవైపు పరశురామ్ పేట్లకు ఒక టాప్ స్టార్‌తో వర్క్ చేయడం ఇదే ప్రథమం. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జోడీతో 'గీత గోవిందం'ను పరశురామ్ పేట్ల రూపొందించిన విధానం బాగా ఇంప్రెస్ చేయడం, అతను చెప్పిన 'సర్కారువారి పాట' స్క్రిప్టు నచ్చడంతో తనను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించాడు మహేశ్. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, చూపించిన అభిమానంతో పరశురామ్‌లోని ఉత్సాహం ఇనుమడించింది. 'సర్కారువారి పాట'ను ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌గా తియ్యాలనే తపనతో రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. నిజానికి సెట్స్ మీదకు వచ్చేసరికి స్క్రిప్టును మరింత ఇంప్రూవ్ చేశాడని సమాచారం. టైటిల్‌కు తగ్గట్లే ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా, కన్నుల పండువగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇప్పటివరకూ కెరీర్‌లో వరుసగా నాలుగు హిట్లు మహేశ్‌కు రాలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన '1.. నేనొక్కడినే' హిట్టయినట్లయితే ఇదివరకే ఆ ఘనత సొంతం అయ్యేది. ఇప్పుడు మరోసారి ఆ గడప దగ్గరకు వచ్చి నిల్చున్నాడు మహేశ్. 'సర్కారువారి పాట' హిట్టయితే వరుసగా నాలుగు హిట్లు సాధించి, సగర్వంగా కాలర్ ఎగరేయవచ్చు. అప్పుడు వరుసగా డబుల్ హ్యాట్రిక్ మీదే కన్నేయవచ్చు. ఈసారి తమ సూపర్‌స్టార్ ఆ ఫీట్ సాధించి చరిత్ర సృష్టిస్తాడని అభిమాన గణం నమ్ముతోంది. మహేశ్ ఏం చేస్తాడో చూడాలి మరి.
![]() |
![]() |