![]() |
![]() |

ఇటీవలి కాలంలో మన సినిమాల్లో హీరోలు లేదా హీరోయిన్లు మెగాస్టార్లు, సూపర్‌స్టార్ల అభిమానులుగా కనిపిస్తుండటం చూస్తున్నాం. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్ తదితర స్టార్ల అభిమానులుగా హీరోలు లేదా హీరోయిన్లు కనిపించారు. నిన్న మొన్నటి వరకూ యువతరం కలలరాణి అనిపించుకున్న రంభ ఇప్పుడు ఓ సినిమాలో హీరోల అభిమాన తారగా కనిపించనున్నారు. అంతే కాదు, ఆమెకు నీరాజనం పడ్తూ ఓ పాట కూడా పాడేసుకున్నారు. ఆ సినిమా.. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న 'మహాసముద్రం' కాగా, రంభకు నీరాజనం పలికిన ఆ నటులు జగపతిబాబు, శర్వానంద్. గమనించదగ్గ అంశమేమంటే గతంలో జగపతిబాబు సరసన రంభ నాయికగా నటించడం. ఇప్పుడు ఈ సినిమాలో ఆమెను ఆరాధించే అభిమానిగా ఆయన నటిస్తున్నారు!
"హే రంభా రంభ" అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాయగా, సంగీత బాణీలు కూర్చిన చైతన్ భరద్వాజ్ స్వయంగా ఈ పాటను ఆలపించాడు. విశాఖపట్నం బీచ్ దగ్గర మందు తాగుతూ, తమ బృందంతో కలిసి శర్వా, జగపతిబాబు హుషారుగా డాన్సులు చేస్తూ ఈ పాటను పాడారు. జాని కొరియోగ్రఫీ సమకూర్చిన ఈ పాటను శుక్రవారం రిలీజ్ చేశారు. రంభ అందచందాలను ఈ పాటలో కీర్తించారు. రంభ నిలువెత్తు కటౌట్లతో ఈ పాటను చిత్రీకరించారు.
"కొర్రమీను మాదిరి వర్ర వర్రగుంటది
కుర్రగాళ్ల గుండెకి గాలం వేస్తదిరా
ఎర్రపెదవి కొరికితే సర్రాసరి నవ్వితే
బుర్ర తిరిగిపోతది గిర్రా గిర్రా గిర్రా గిర్రా
ఓ రంభా రంభ హే రంభా హే రంభా రంభా రంభా" అంటూ సరా సరా నడిచి, రంభకు నీరాజనం పట్టింది పాట.
ఈ పాట మధ్యలో భాస్కరభట్ల వాయిస్ కూడా రావడం గమనార్హం. "సోడా ఐసు లేకుండా రెండు నైంటీలు గనుక పీకామనుకో బాడీలో రంభ డాన్స్ ఆడేద్దిరా మామా" అని చెప్పారు భాస్కరభట్ల. ఈ పాట ఇప్పటి కుర్రకారునే కాదు, నిన్నటి కుర్రకారును కూడా ఊపేసేటట్లు ఉంది.
'మహాసముద్రం'లో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా, అదితిరావ్ హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు, రావు రమేశ్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు కీలక పాత్రలు చేస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ మూవీని అనిల్ సుంకరకు చెందిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
![]() |
![]() |