![]() |
![]() |

విభిన్న సినిమాలు చేస్తూ, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. ఇటీవల 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సూర్య.. వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమాల్లో 'జై భీమ్' ఒకటి. నేడు(జూలై 23) సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
'జై భీమ్' సూర్య కెరీర్ లో 39వ సినిమాగా తెరకెక్కుతోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకుడు. ఈ సినిమాలో ఆదివాసుల పక్షాన పోరాడే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో సూర్య లాయర్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఆదివాసులు తమకోసం పోరాడే వ్యక్తి కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా పోస్టర్ ను డిజన్ చేశారు.
'జై భీమ్'లో కేరళ యువ నటి రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
![]() |
![]() |