![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచుతున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే మాటల యుద్ధం మొదలైంది. మా అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమైన మంచు విష్ణు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో జైలుకెళ్లాల్సిన కొంతమందిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని.. వాళ్ళు శృతి మించితే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించాడు.
మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని, ప్రస్తుతం ఇండస్ట్రీ కి పెద్దదిక్కు అనేది లేకుండా పోయిందని విష్ణు అన్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఏది చెబితే అది వినేవారని ఇప్పుడు ఆ విధానం మారిపోయిందని పేర్కొన్నాడు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని.. దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని అన్నాడు. అయితే సినిమా పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా 'మా'కు ఏదైనా మంచి చేద్దాం అంటే తాను కూడా కచ్చితంగా వింటానని చెప్పుకొచ్చాడు. అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా 'మా' భవనాన్ని నిర్మిస్తానని, దానికి నందమూరి బాలకృష్ణ కూడా సాయం చేస్తానన్నారని తెలిపాడు.
ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు తనను నిలబడమని చెప్పడం వల్లే తాను బరిలోకి దిగానని అన్నాడు. అప్పుడు రేసులో మరెవరూ లేరని.. దాని తర్వాత ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పనని.. కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవలను తాను బయట పెట్టనని అన్నాడు. ఇండస్ట్రీలో పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కపెట్టాల్సిన చాలా మంది తాను చేసిన సాయం వల్లే ఇప్పుడు బయట తిరుగుతున్నారని అన్నాడు. జైలుకెళ్లాల్సిన వారిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని, వాళ్ళు శృతి మించితే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించాడు. ప్రస్తుతం విష్ణు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
![]() |
![]() |