![]() |
![]() |

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో సీనియర్ స్టార్ రాజశేఖర్ ఒకరు. మరీముఖ్యంగా.. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన కాప్ డ్రామా 'అంకుశం'(1989).. రాజశేఖర్ నట జీవితాన్నే కీలక మలుపు తిప్పింది. అంతేకాదు.. తన కెరీర్ లో ఇప్పటికీ బెస్ట్ మూవీ అంటే 'అంకుశం' అనే స్థాయిలో ప్రజాదరణ పొందిందీ సినిమా. విశేషమేమిటంటే.. ఈ సినిమాకి హిందీ వెర్షన్ గా రూపొందిన 'ప్రతిబంధ్' (1990)తోనే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లో తొలి అడుగేశారు.
కన్నడంలోనూ ఈ సెన్సేషనల్ మూవీ 'అభిమన్యు' (రవిచంద్రన్ హీరో) పేరుతో రీమేక్ కాగా.. అందులో అప్పటి వర్థమాన నటుడైన నేటి మాస్ మహారాజా రవితేజ ఓ చిన్న పాత్రలో మెరిశారు. ఈ రెండు రీమేక్స్ ని అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టినే తెరకెక్కించడం మరో విశేషం. అదేవిధంగా.. తమిళంలో 'ఇదుదాండ పోలీస్'తో అనువాదమైన 'అంకుశం' అక్కడ కూడా విజయం సాధించింది.
రాజశేఖర్ కి జంటగా ఆయన శ్రీమతి జీవిత నటించిన ఈ సినిమాలో రామిరెడ్డి ప్రతినాయకుడిగా దర్శనమివ్వగా.. ఎమ్మెస్ రెడ్డి, బాబూ మోహన్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి మల్లెమాల సాహిత్యమందించారు. పాటల్లో "ఇది చెరగని ప్రేమకు శ్రీకారం" (ఎస్పీ బాలు, జానకి) చార్ట్ బస్టర్ గా నిలిచింది. 'ఉత్తమ ప్రతినాయకుడు' (రామిరెడ్డి), 'ఉత్తమ కథా రచయిత; (ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ యూనిట్) విభాగాల్లో 'నంది' పురస్కారాలను దక్కించుకున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాత ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. 1989 జూలై 13న విడుదలై సంచలనం సృష్టించిన 'అంకుశం'.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |